తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ తగిలింది. అమరావతి చుట్టూనే రాజకీయాలు చేస్తోన్న టీడీపీకి, ఊహించని రీతిలో రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది.. అదీ పరోక్షంగా. ఉద్యమం నడుపుతున్నది అమరావతికి చెందిన రైతులే అయినా, ఆ రైతుల వెనుకాల వున్నది మాత్రం తెలుగుదేశం పార్టీనే. ఆ రైతుల్లో మెజార్టీ రైతులు తమ భూముల విలువ పడిపోయిందన్న ఆందోళనతోనే ఉద్యమాలు చేస్తున్నారన్నదీ నిర్వివాదాంశం. ఇంతకీ, తెలుగుదేశం పార్టీకి తగిలిన ఆ షాక్ ఏంటి.? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ‘భ్రమరావతనేనా.?’ అని ఎందుకు అనుకుంటున్నాయి.?
ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యేలా వుందట
రాజధాని అమరావతి.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోనే ప్రకటించారు. ఆ తీర్మానానికి అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోద ముద్ర వేసింది. అలా, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే హోదా వచ్చింది. రాజధాని అయ్యేనాటికి అమరావతిలో రాజధాని అనదగ్గ నిర్మాణాలేవీ లేవు. ఆ తర్వాతే అమరావతిలో తాత్కాలికం పేరుతో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించడం జరిగింది. ఆ తాత్కాలికమే 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కొంప ముంచింది.. అదే ఇప్పుడు అమరావతి కొంప ముంచుతోంది కూడా.
అసెంబ్లీకి, రాజధానిని మార్చే హక్కు ఎందుకు వుండదు.?
ఇది అసలు సిసలు ప్రశ్న. అసెంబ్లీలో రాజధానికి అనుకూలంగా తీర్మానం జరిగినప్పుడు, అదే అసెంబ్లీ రాజధానిని మార్చేందుకు కూడా హక్కుని కలిగి వుంటుందన్నది హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్య. దీనిపై తెలుగుదేశం పార్టీ నోరు మెదపలేకపోతోంది. అసెంబ్లీకి ఆ హక్కు వుంటుంది కాబట్టి, రాజధానిని అమరావతి నుంచి ఇంకో చోటకు మార్చుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి దక్కుతుందని భావించాలి.
అయ్యయ్యో.. అదీ పాయె.. ఇదీ కూడా పాయె.!
అమరావతికి సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలపై వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధానిని మార్చే హక్కు అసెంబ్లీకి వుంటుందన్న హైకోర్టు వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నారు వారంతా. ఈ లెక్కన, అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని మార్చేందుకు వెసులుబాటు దొరకవచ్చనీ, ప్రభుత్వం తలచుకుంటే అమరావతిలో శాసన రాజధానిని కూడా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చనీ, దీన్ని ఎవరూ అడ్డుకోలేరనీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది నిజంగానే టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విషయం. అయితే, హైకోర్టు ఇంకా ఈ వ్యవహారంపై తీర్పు చెప్పలేదు. జస్ట్ ఓ ప్రశ్నను లేవనెత్తిందంతే.ఇదిలా వుంటే, గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలెవరూ తమ ఉద్యమానికి ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడం పట్ల రాజధానిలో ఉద్యమిస్తోన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి విషయంలో తెలుగు దేశం పార్టీ చిత్తశుద్ధిపై రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అనుమానాలు కలుగుతున్నాయి. అమరావతి వల్ల రాజకీయ ప్రయోజనం లేదనే భావనలో తెలుగు తమ్ముళ్ళు వుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.