ఆంధ్రపదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల మధ్య కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వానికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కీ మధ్య జరుగుతున్న వ్యవహారంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ.. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించేందుకోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ పోరులో ఇప్పటికే ఎస్ఈసీ విజయం సాధించింది. అయినాగానీ, ఇంకా ఆధిపత్య పోరు కొనసాగుతూనే వుంది. ఏకగ్రీవాలపై నడుస్తున్న వివాదం.. అధికారులకు సంబంధించి బదిలీల వ్యవహారం.. ఇలా చెప్పుకుంటూ పోతే కథ చాలానే వుంది. ఇదంతా ఓ ఎత్తు.. పచ్చ రాజకీయం ఇంకో ఎత్తు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తోంది.
నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్నారు. ఆయనకు రాజకీయ రక్షణ అవసరం లేదు. వ్యవస్థలే ఆయన రక్షణను చూసుకుంటాయి. అయితే, టీడీపీ నేతల అత్యుత్సాహం కారణంగా, ‘నిమ్మగడ్డ టీడీపీ మనిషే’ అన్న భావన అందరిలోనూ కలిగేలా చేస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ విషయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలు కాస్తా, అధికార పార్టీ నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా వుంటున్నాయి. దీంతో, నిమ్మగడ్డ.. తొలుత చర్యలంటూ తీసుకోవాల్సి వస్తే, టీడీపీపైనే తీసుకోవాలన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ఇదే నిమ్మగడ్డ గతంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనూ అధికార పార్టీ ఆగడాలు కొనసాగాయి. అప్పట్లో నిమ్మగడ్డపై పరోక్షంగా టీడీపీ విమర్శలు చేసిన విషయాన్ని ఎలా విస్మరించగలం.? ఒక్కటి మాత్రం నిజం.. రాజకీయ పార్టీలు తమ అవసరాలకు తగ్గట్టుగా వాయిస్‌ని మార్చేసుకుంటాయి. ఇలాంటి విషయాల్లోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ లాంటి అధికారులు ఆచి తూచి వ్యవహరించాల్సి వుంటుంది. కోర్టు కేసులు తదితర వ్యవహారాల నిమిత్తం, బీజేపీలో వున్న టీడీపీ సానుభూతిపరుడైన ఓ ప్రముఖ నేతతో నిమ్మగడ్డ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భేటీ అవడం సహా అలాంటి కొన్ని వ్యవహారాలు.. నిమ్మగడ్డకు సైతం రాజకీయాన్ని ఆపాదించేశాయన్నది నిర్వివాదాంశం.