ఖచ్చితంగా ఇది టిడిపికి పెద్ద దెబ్బే… కాబోయే రాజధాని విశాఖ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైసిపిలోకి జంప్ అవుతున్నారు. ఉత్తరాంధ్ర లో ఈ పరిమాణం చోటుచేసుకోనుండటం చంద్రబాబుకు భారీ నష్టం కలగచేస్తుండనడంలో సందేహం లేదు. టిడిపి అధినేతకు ఆ షాక్ ఇస్తోంది మరెవరో కాదు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ఈయన ఈరోజే సిఎం జగన్ ను కలిసి వైసిపికి తన మద్దతు ప్రకటిస్తారని సమాచారం.
నేడే ఆ ముహుర్తం…
విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అది పార్టీతో వచ్చిన కొద్దిపాటి గ్యాప్ గా భావించారు. అయితే ఆ గ్యాప్ లో వైసిపి నేతలు ఆయనను తమ వైపుకు తిప్పేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కొన్ని రోజులుగా ఆయన వైసిపి నేతలతో ఫుల్ టచ్ లో ఉంటూ ఏకంగా ఆ పార్టీకి తన బహిరంగ మద్దతు తెలిపేందుకు సిద్దమయ్యారని తెలిసింది. ఇందుకు ఈ శనివారమే ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. నేడు సిఎం జగన్ ను ఆయన క్యాంప్ ఆఫీసులో కలసి పార్టీకి బేషరుతు మద్దతు ప్రకటిస్తారని సమాచారం.
రాజకీయ ప్రస్థానం
వాసుపల్లి గణేష్ 2009 ఎన్నికలకు విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేశారు. అప్పుడు సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన కోల గురువులుపై ఓటమి పాలయ్యారు. అయితే 2014లో అదే కోల గురువులు వైసిపిలో చేరగా ఆయనపై విజయం సాధించారు. గత 2019 ఎన్నికల్లో పైతం వైసిపి అభ్యర్థిగా ఉన్న కోల గురువులు పైనే మరోసారి విజయకేతనం ఎగురవేశారు.
పార్టీ కండువా కప్పుకుంటారా?
అయితే ఈయన నేరుగా వైసిపిలో చేరే అవకాశం ఉండదని తెలుస్తుంది. కారణం గతంలో జగన్ ఎవరైనా టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని ప్రకటింంచిన సంగతి తెలిసిందే. దీంతో ఏ కారణం చేతనైనా వైసిపిలో చేరాలనుకునే టిడిపి ఎమ్మెల్యేలు నేరుగా ఆ పార్టీ కండువా కప్పుకొని చేరిపోవడం కాకుండా బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఆ రకంగా చేయగా తాజాగా వాసుపల్లి గఱేష్ అదే బాటలోనే నడవనున్నారు.
కారణం అదేనా?
వాసుపల్లి గణేష్ వైసిపిలో చేరాలనుకోవడానికి కారణం వైసిపి సిఎం జగన్ విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయించడంతో అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం కన్నా అధికార పార్టీ మద్దతుదారుగా ఉంటే తన నియోజకవర్గంలోనే కాదు కాబోయే రాజధానిలో కీలక పాత్ర పోషించవచ్చనేది వాసుపల్లి గణేష్ అభిమతంగా తెలుస్తోంది. దీనికి తోడు విశాఖ కన్నా అమరావతే రాజధానిగా తన మద్దతు అని తాను ప్రకటించినట్లు తనతో సంప్రదించకుండా టిడిపియే లేఖ విడుదల చేయడంపై వాసుపల్లి గణేష్ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. దీంతో రోగి కోరిందే వైద్యుడిచ్చినట్లు తాను కోరుకుందే టిడిపి ఈ రకంగా అవకాశం కల్పించిందిలే అనుకొనా ఆయన ఇదే నెపంతో టిడపికి దూరంగా ఉంటూ వస్తున్నారట.
టిడిపికి ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బే…
తమకు బాగా పట్టున్న ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో గట్టి దెబ్బ తిన్న టిడిపికి ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హ్యాండివ్వడం ఖచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందులోనూ విశాఖను కార్య నిర్వాహక రాజధాని చెయ్యాలని సిఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో అక్కడ తమకు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే ఇలా అధికార పార్టీ మద్దతుదారుడిగా మారిపోతే జరిగే నష్టం కూడా భారీ గానే ఉంటుంది. అందుకే మిగతా ఎమ్మెల్యేల కన్నా ఈ ఎమ్మెల్యే చేజారిపోవడం పై చంద్రబాబు బాధ కొంత అధికంగానే ఉందంటున్నారు.