తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎంతోకాలంగా మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబు, పార్టీని బలోపేతం చేసే దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడుగా మాజీ మంత్రి, సీనియర్ నేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని నియమించారు. ఇది చాలామంది ముందే ఊహించిన విషయం. ఇందులో కొత్తదనమేమీ లేదు. అయితే, అచ్చెన్నాయుడి నియామకాన్ని అడ్డుకునేందుకు పార్టీలో కొందరు ముఖ్య నేతలు నానా తంటాలూ పడటం.. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడమే ఆసక్కిరమైన విషయం.
ఎర్రన్నాయుడు కుటుంబానిదే పెత్తనం?
దివంగత నేత ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రజా ప్రతినిథులుగా వున్నారు. ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు (ఎమ్మెల్యే), ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్‌నాయుడు (ఎంపీ), ఎర్రన్నాయుడి కుమార్తె భవానీ (ఎమ్మెల్యే) టీడీపీకి సంబంధించి ప్రస్తుతం కీలక నేతలుగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇందులో ఇద్దరికి చంద్రబాబు కీలక పదవులు కట్టబెట్టారు. అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడైతే, రామ్మోహన్‌నాయుడిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని.. ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు చంద్రబాబు. రేపో మాపో ఎమ్మెల్యే భవానీకి కూడా పార్టీలో కీలకమైన పదవి దక్కొచ్చు. ఇవన్నీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తప్ప, పార్టీని బలోపేతం చేసే చర్యలు కావన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. పార్టీ మారాల్సిందిగా అచ్చెన్నాయుడిపై అధికార వైసీపీ నుంచి చాలా ఒత్తిడి వుంది. రామ్మోహన్‌నాయుడికి ఇటు వైసీపీతోపాటు అటు బీజేపీ కూడా గాలమేస్తోంది. ఈ నేపథ్యంలో ‘పట్టు జారిపోకుండా’ చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణకి పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశం దక్కడం ఇంకో కీలకమైన పరిణామం. గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి.. తదితర సీనియర్ నేతలు, పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతుండగా, వారికి కూడా కీలకమైన పదవులు పార్టీ పరంగా కట్టబెట్టారు చంద్రబాబు.
చేతులు కాలాక..
అయితే, ఇవన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన మారిన వ్యవహారాలు తప్ప, పార్టీకి ఏ రకంగానూ లాభం చేయబోవని ఆఫ్ ది రికార్డ్‌గా టీడీపీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందే పార్టీని సంస్థాగతంగా చంద్రబాబు బలోపేతం చేసి వుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికారం కోల్పోయిన వెంటనే అయినా పార్టీలో మార్పులు చేసి వుంటే బావుండేది. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. పార్టీ నుంచి చాలామంది ముఖ్య నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయింది. ‘మాకు సంక్షోభాలు కొత్త కాదు, సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోగలం.. తిరిగి సత్తా చాటగలం..’ అని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారుగానీ, ఇప్పుడు పరిస్థితులు అంత సానుకూలంగా లేవు.
గ్రౌండ్ లెవల్‌లో లోకేష్ టూర్ రాజకీయాలు..
ఇదిలా వుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎట్టకేలకు కరోనా లాక్ డౌన్ మూడ్ నుంచి బయటకు వచ్చినట్లున్నారు. భారీ వర్షాలతో ముంపు బారిన పడ్డ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ‘ప్రజల్ని ఆదుకోమని మేం డిమాండ్ చేస్తోంటే, ప్రజల్ని ఆదుకోవడంలేదు సరికదా, నా మీద వెటకారాలు చేస్తున్నారు’ అని లోకేష్ రాజకీయ విమర్శల్ని అధికార వైసీపీ మీద స్ట్రాంగ్‌గానే చేశారు. అధికార పార్టీ నుంచి ఈ విమర్శలకు కౌంటర్ కూడా గట్టిగానే రావొచ్చు. లోకేష్ ఒక్కరే సరిపోదు, పార్టీ యంత్రాంగమంతా గ్రౌండ్ లెవల్‌లో తిరగాలి.. పార్టీ గళం విప్పగలగాలి. అప్పుడే, పార్టీలో చోటు చేసుకున్న కొత్త మార్పులు.. పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించామని టీడీపీ తాజా నియామకాలతో ప్రచారం చేసుకుంటుండడం కొంతవరకు ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించే విషయమే. కానీ, ఈ ఉత్సాహం ఎన్నాళ్ళు? అనేదే అసలు ప్రశ్న.