విశాఖ జిల్లాలో మూడు రాజధానుల కోసం వైసీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలో కొంత మేర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కింద పడ్డారు. ‘గో బ్యాక్ పోలీస్..’ అంటూ వైసీపీ శ్రేణులు ఆందోళన చేసినప్పటికీ, పోలీస్ అధికారి కింద పడిపోవడానికి కారణం తాము కాదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సదరు పోలీస్ అధికారిదీ అదే వాదన. ఓ వాహనం తన పక్కనుంచి వెళుతుండగా, తూలి పడిపోయినట్లుగా ఆ అధికారి చెప్పడమే కాదు, కిందపడిపోయిన తనను పైకి లేపి, సపర్యలు చేసింది వైసీపీ నేతలేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ, దీన్ని రాజకీయం చేసే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించారు.. సోషల్ మీడియాలో ఓ ట్వీటేశారు. దానికి పోలీసుల నుంచీ కౌంటర్ వచ్చిపడింది. ‘వైసీపీ గూండాల దాడి..’ అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల్ని, పోలీసులు ఖండించారు.
వివాదాన్ని మళ్ళీ రాజేసిన చినబాబు
‘ఈ తరహా దుష్ప్రచారాన్ని ఆపాలి.. లేదంటే, కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం..’ అంటూ పోలీసు అధికారులు హెచ్చరించినా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తగ్గలేదు. పోలీసు వ్యవస్థని కించపర్చేలా వ్యాఖ్యానించారు. దెబ్బలు తిని, మళ్ళీ ఇలా బుకాయిస్తారా.? అంటూ విరుచుకుపడిపోయారు నారా లోకేష్. అసలు గొడవ ఏం జరిగింది.? తప్పు ఎవరిది.? అన్నది తేల్చాల్సింది పోలీసులే. ఆ పోలీసులే, తమకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి సమస్యా లేదని తేల్చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తల వల్ల తమకు గాయాలవలేదని కూడా చెబుతున్నారు. మరి, చినబాబు నారా లోకేష్‌కి ఎందుకు నొప్పి.?
పోలీస్‌పై ‘పచ్చ జులుం’ ఇదే తొలిసారి కాదు..
రాష్ట్రంలో చాలా ఘటనల విషయంలో చంద్రబాబు అండ్ టీమ్ అత్యుత్సాహం చూపుతూనే వుంది. పోలీసులపై విరుచుకుపడటం టీడీపీ నేతలకు సర్వసాధారణమైపోయింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలోనూ టీడీపీ చాలా జోరు ప్రదర్శిస్తోంది. పోలీసులు దాదాపుగా ప్రతి సందర్భంలోనూ టీడీపీపై కౌంటర్ ఎటాక్ చేస్తూనే వున్నారు. అయినాగానీ, తీరు మారడంలేదు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఎన్నిసార్లు వారించినా, మందలించినా టీడీపీ తీరు మార్చుకోకపోవడం శోచనీయం.
చంద్రబాబుని అరెస్ట్ చేయాల్సిందేనా.?
చంద్రబాబుని అరెస్ట్ చేయాలి.. చంద్రబాబు తనయుడిని అరెస్ట్ చేయాలి.. అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు నినదిస్తున్నాయి.. ఈ క్రమంలో ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ని ట్యాగ్ చేస్తున్నాయి. ఏమో, తప్పు ఎక్కడ జరిగిందో.! పోలీసులే క్లారిటీ ఇచ్చాక వివాదాన్ని ఇక్కడితో టీడీపీ వదిలేయడమే మంచిది.