అసెంబ్లీలో తన్నుకున్న ఎమ్మెల్యేలు… ఎవరిది తప్పంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు భౌతికదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో వివిధ అంశాలపై టీడీపీ సభ్యులు పద్దతి మరచి, సభా సాంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ తమ్మినేని.. టీడీపీ ఎమ్మెల్యేలను పదే పదే సస్పెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 20న సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ప్రకాశం జిల్లా కొండెపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు – సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

వివారాళ్లోకి వెళ్తే… రోడ్లపై ర్యాలీలు సభలు సమావేశాలను రద్దు చేస్తూ ఇటీవల జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇరుకు సంధుల్లో సభలు సమావేశాలు పెట్టి ప్రజలను ఇబ్బందిపెట్టడమే కాకుండా… వారి ప్రాణాలతో బాబు చలగాటమాడుతున్నారని భావించిన అధికారపక్షం ఈ జీవోను తీసుకొచ్చింది. అందుకోసం బాబు మీటింగుల్లో జరిగిన ప్రమాధాలు – చోటుచేసుకున్న మరణాలను సాక్ష్యాలుగా చూపించింది. ఈ జీవోపై మేదవులు – రిటైర్డ్ ఐఏఎస్ లు – ఐపీఎస్ లు – పార్టీలకతీతంగా కొందరు సీనియర్ రాజకీయ నాయకులు – రాజకీయ విశ్లేషకులు సమర్ధించిన సంగతి తెలిసిందే! ఈ జీవో ప్రతిపక్షాలకోసం మాత్రమే కాదని.. ఇది ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు కూడా!

అయితే జనాల ప్రాణాలు ఏమైతే మాకేంటి అనుకున్నారో లేక, ఏదోలా అల్లరి సృష్టించాలని భావించారో తెలియదు కానీ… ఈ జీవోని రద్దుచేయాలని స్పీకర్ ముఖంపై ఫ్లకార్డులు పెట్టారు టీడీపీ నేతలు. సందడిలో సడేమియాలాగా.. స్పీకర్ ముఖానికి ఫ్లకార్డులు అడ్డుపెట్టి దాడికి పాల్పడ్డారు. పేపర్లు చింపి స్పీకర్ పైకి విసిరారు. దీంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ కు రక్షణగా పోడియం చుట్టూ వైకాపా నాయకులు చేరిపోయారు. ఈ సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేల దురుసుప్రవర్తనతో… ఘర్షణ వాతావరణం నెలకొంది! ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకున్నట్టు తెలుస్తోంది!

ఈ క్రమంలో గొడవ మరింత పెద్దది కాకుండా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారని తెలుస్తుంది. ఆ సంగతులు అలా ఉంటే… ఏదో ముతక సామెత చందాన్నా… వైసీపీ ఎమ్మెల్యేలే తమపై దాడి చేశారంటూ మొగసాలకెక్కినంత పనిచేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు! అయితే కేవలం అల్లర్లు సృష్టించడానికే తప్ప… ప్రజాసమస్యలపై చర్చించే ఉద్దేశ్యంతో అసెంబ్లీకి రావడం లేదని… అచ్చెన్నా నోరేసుకుని, ఒళ్లేసుకుని పడిపోతున్నారు తప్ప ఆలోచించి ప్రవర్తించడంలేదని వైకాపా నాయకులు ఫైరవ్వడం మొదలుపెట్టారు.

అసెంబ్లీలో అధికారపక్షాన్ని ప్రశ్నించే శక్తి లేక, ప్రజాసమస్యలు ఏమైనా ఉంటే వాటిపై ప్రభుత్వాన్ని నిలదీసే ధమ్ములేక… అసెంబ్లీకి గైర్హాజరై హైదరాబాద్ లో ఇంట్లో కూర్చుని.. అచ్చెన్నాలాంటి వారిని తమపైకి ఉసిగొల్పుతున్నారని వైకాపా నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు!

ఇప్పటికే సమాజంలో రాజకీయ నాయకులన్నా.. అసెంబ్లీ సమావేశాలన్నా ఒక రకమైన ఏహ్యభావం నెలకొంటున్న పరిస్థితి. ఇది చాలదన్నట్లు రాజకీయనాయకులు అసెంబ్లీలో ఏకంగా కొట్టుకోవడం, తన్నుకోవడం, స్పీకర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చిల్లరగా బిహేవ్ చేయడం, వీధిరౌడీలు సైతం అసహ్యించుకునేలా అల్లరి చేయడం సరైంది కాదని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.