సీపీఎస్ రద్దు.! ఏపీ ఉద్యోగులేమంటున్నారు.?

సీపీఎస్ రద్దయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. ఉద్యోగులూ కొంతవరకు హ్యాపీగానే వున్నారు. ఉద్యోగులు కోరుకున్నది సీపీఎస్‌ని రద్దు చేయాలని. అదే సమయంలో, ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరణను కోరుకుంటున్నారు.

అయితే, సీపీఎస్‌ని రద్దు చేసిన వైసీపీ సర్కారు, కొత్తగా జీపీఎస్ తీసుకువస్తామంటోంది. ఓపీఎస్ కంటే జీపీఎస్ చాలా మెరుగైనది.. అంటోంది వైసీపీ ప్రభుత్వం. కానీ, ఉద్యోగులు ప్రభుత్వ వాదనతో ఏకీభవించడంలేదు. సీపీఎస్ రద్దు విషయంలో సంతృస్తిగా వున్నా, వారికి జీపీఎస్ నచ్చడంలేదు. అలాగని, ప్రభుత్వాన్ని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలూ ఘాటుగా విమర్శించే పరిస్థితి లేదు. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు.. రెండూ వేర్వేరు కాదు. ప్రభుత్వంలో వున్నవారి విధానాలు ఉద్యోగులకు నచ్చకపోవచ్చు. కానీ, ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధం ప్రకటిస్తే, ప్రజలు హర్షించే పరిస్థితి వుండదు.

అందుకే, ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో వున్నవారు, తమ వాదన తప్పే అయినా… దాన్ని సమర్థవంతంగా వినిపించగలరు. ఉద్యోగులకు ఆ అవకాశం వుండదు కదా.? అందుకే, సమయం కోసం వేచి చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ వైపు గంపగుత్తగా నిలబడిన మాట వాస్తవం. కానీ, 2024 ఎన్నికల నాటికి ఆ పరిస్థితి వుండకపోవచ్చు. సీపీఎస్ రద్దు చేసినా, వైసీపీకి అనుకూల పరిస్థితులైతే ఉద్యోగ వర్గాల్లో కనిపించడంలేదు.