హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు… పోలీసుల అదుపులో సూరత్‌ మహిళ!

హైదరాబాద్‌ లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ అడ్డాగా కొంతమంది ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తుంటారని, స్థానికంగా కొంతమంది వారి సానుభూతిపరులు ఉన్నారని కథనాలొస్తుంటాయి. వీటికి బలం చేకూర్చే సంఘటనలు రెగ్యులర్ గా తెరపైకి వస్తుంటాయి. అందులో భాగంగా తాజాగా ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

అవును… మంగళవారం రాత్రి ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న మహ్మద్ జావీద్, ఖతిజా అనే తండ్రీకూతురును రామగుండంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో… పాతబస్తీ వేదికగా ఉగ్ర కార్యకలాపాలు నడిపేందుకు ప్రయత్నించిన సూరత్‌కు చెందిన సుమేరా బాను అనే మహిళను అహ్మదాబాద్‌ ఏటీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా ఆ మహిళను విచారిస్తున్న సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. ఆన్‌ లైన్‌ వీడియోల ద్వారా ప్రేరణ పొందిన సుమేరా బాను.. ఐ.ఎస్‌.ఐ.ఎస్‌. అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఖొరాసన్‌ ప్రావెన్సీలో (ఐ.ఎస్‌.కే.పీ.)లో చేరింది. ఇందులో భాగంగా… హైదరాబాద్‌ ను అడ్డాగా మార్చుకుని ఉగ్రవాద కార్యకలాపాలు జరపాలని ప్లాన్ చేసినట్లు తాజాగా బయటపడింది.

దీనికోసం కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన ఓ మెడికల్‌ షాపు యజమానితో సుమేర బాను సంప్రదింపులు జరిపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా అతడిని పరిచయం చేసుకున్న ఈమె… హైదరాబాద్‌ లో ఉద్యోగం కావాలని సుమేరాను కోరినట్లు పోలీసులు కన్ ఫాం చేస్తున్నారు.

అయితే 2021లో భర్త నుంచి విడిపోయిన సుమేరాకు అప్పటికే ఇద్దరు సంతానం కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అనంతరం ఉగ్రవాదానికి ఆకర్షితురాలై దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చి పథకాలు రచిస్తుందని గుర్తించినట్లు తెలిసింది. దీంతో… ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.