Stock Market: స్టాక్ మార్కెట్‌లో కుప్పకూలిన సూచీలు.. నిన్న లాభాలు, ఈ రోజు నష్టాలు!

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి ఊగిసలాటకు గురైంది. నిన్న భారత్-పాక్ మధ్య తాత్కాలికంగా తలెత్తిన శాంతి పరిస్థితుల ప్రభావంతో మార్కెట్ చల్లబడినట్లే కనిపించింది. కానీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో పాటు, టెక్నాలజీ రంగం భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు భారీగా పతనమయ్యాయి.

సెన్సెక్స్ 1,281 పాయింట్ల నష్టంతో 81,148 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 346 పాయింట్లు పడిపోయి 24,578 స్థాయికి చేరింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ వంటి బ్లూ చిప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.33కి చేరడం కూడా మన మార్కెట్‌ను ప్రభావితం చేసింది.

ఇన్ఫోసిస్ 3.54 శాతం నష్టపోయింది. అలాగే పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్ షేర్లలో కూడా 2-3 శాతం వరకూ నష్టాలు నమోదయ్యాయి. టెక్ రంగంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, కంపెనీల ఫలితాలపై పెట్టుబడిదారుల అప్రమత్తత మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, కొన్ని స్టాక్స్ మాత్రం స్థిరంగా నిలిచాయి. సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అయితే మొత్తం మార్కెట్ వాతావరణం మాత్రం ప్రతికూలంగా మారింది. నిఫ్టీ 50లో 45 స్టాక్స్ నష్టాల్లో ఉండగా, కేవలం ఐదు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇకపోతే, రేపటి ట్రేడింగ్‌లో సెంటిమెంట్ ఎలా మారుతుందన్నదే ఇప్పుడు ట్రేడర్లలో ఆసక్తికర చర్చగా మారింది.

Ex. DCP Reddanna praised the bravery of Jawan Murali Naik | Telugu Rajyam