ప్రత్యేక హోదా, ఏపీలో బీజేపీకి పెద్ద సంకటమే.!

Group politics in Telangana BJP

పంచాయితీ ఎన్నికల హోరు రాష్ట్రంలో కనిపిస్తున్నా, దానికంటే ఎక్కువ రాజకీయ చర్చ తిరుపతి ఉప ఎన్నిక గురించి జరుగుతోంది. బీజేపీ – జనసేన మధ్య అవగాహన ఇంకా కుదరలేదు. ఆ మాటకొస్తే, టీడీపీ తప్ప ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అసలు, తిరుపతి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే, గ్రౌండ్‌ లెవల్‌లో మాత్రం ఆయా పార్టీలు ఒకింత యాక్టివ్‌గానే వున్నాయి. ఈ రేసులో అందరికన్నా ముందున్నది బీజేపీ – జనసేన. అయితే, ఏ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థి పోటీ చేయాలన్నదానిపై రెండు పార్టీల మధ్యా ‘లంపాటకం’ ఓ కొలిక్కి రావడంలేదు. అదే ఈ రెండు పార్టీలకూ అతి పెద్ద సమస్య. ఇక, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించిందిగానీ, ఆమె ఇంతవరకూ తిరుపతి నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిమిత్తం కనిపించలేదు. వైసీపీ తమ అభ్యర్థి ఎవరన్నదానిపై చూచాయిగా ఓ లీకు ఇచ్చింది తప్ప, అధికారికంగా ప్రకటించని పరిస్థితి. సరే, అభ్యర్థి ఎవరు.? అన్నది పక్కన పెడితే, తిరుపతి ఉప ఎన్నికలో ప్రత్యేక హోదా అంశమే ‘ప్రచారాస్త్రం’ కానుంది. టీడీపీ, వైసీపీ ఈ అంశం చుట్టూ వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి కూడా.

Special status is a big problem for BJP in AP!

పార్లమెంటు సమావేశాల వేళ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నది వైసీపీ, టీడీపీ విడివిడిగా అమలు చేస్తున్న వ్యూహం. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయాలంటే ఈ రెండు పార్టీలకీ ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితే. అయినాగానీ, వైసీపీని ఇరుకున పెట్టాలని టీడీపీ, టీడీపీని ఇరుకున పెట్టాలని వైసీపీ.. పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశాన్ని చాలా గట్టిగానే లేవనెత్తుతాయి. తద్వారా వచ్చే పబ్లిసిటీని, తిరుపతి ఉప ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీ విడివిడిగా వినియోగిస్తాయనుకోండి. అది వేరే వ్యవహారం. మరి, ప్రత్యేక హోదాపై బీజేపీతోపాటు జనసేన.. తిరుపతి ఓటర్లకు ఏం సమాధానం ఇవ్వగలుగుతాయి.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.