ప్రత్యేక హోదా అస్త్రం తీయనున్న వైఎస్సార్సీపీ

bjp had special status effect on tirupati by election

ప్రత్యేక హోదానా.? అంటే ఏమిటి.? అని జనం ముక్కున వేలేసుకునే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకొచ్చాయి. 2014 ఎన్నికల్లో గెలిచాక బీజేపీ, టీడీపీ, 2019 ఎన్నికల్లో గెలిచాక వైఎస్సార్సీపీ.. ప్రత్యేక హోదా అంశానికి పాతరేసేశాయి. ‘కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదు.. అయినా అడుగుతూనే వుంటాం..’ అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం రాజీ పడ్డారు. ఆ తర్వాత బీజేపీతో బంధం తెగ్గొట్టుకుని, ప్రత్యేక హోదా పేరుతో నానా రకాల డ్రామాలూ ఆడారు. ఇంతకీ, ప్రత్యేక హోదా పరిస్థితేంటి.?

ప్రత్యేక హోదా అస్త్రం తీయనున్న వైఎస్సార్సీపీ
bjp had special status effect on tirupati by election

ముగిసిన అధ్యాయమా.? మొదలవనున్న యుద్ధమా.?

తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం మళ్ళీ ప్రస్తావనకు వస్తోంది. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం..’ అని తిరుపతి సాక్షిగానే నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. అప్పటికి ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి మాత్రమే. ఓ వైపు చంద్రబాబు, ఇంకో వైపు పవన్‌ కళ్యాణ్‌ వుండగానే మోడీ ఈ ప్రకటన చేసిన విషయం విదితమే. కానీ, ప్రధాని అయ్యాక నరేంద్ర మోడీ, ప్రత్యేక హోదా అంశానికి పాతరేసేశారు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక వేళ ఆ ప్రత్యేక హోదా అనేది ప్రధాన అస్త్రం కాబోతోంది.

బీజేపీకి ప్రత్యేక హోదా పెద్ద తలనొప్పి

ప్రత్యేక హోదా ఇస్తారా.? ఇవ్వరా.? అన్న నిలదీతలు ఇప్పటికే బీజేపీకి మొదలయ్యాయి. హోదా విషయాన్ని అటకెక్కించేశారు.. మరి, ప్యాకేజీ ఏమయ్యింది.? ఎవరికిచ్చారు.? పోనీ, దాన్నీ పక్కన పెడదాం.! వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు కదా.! అదేమయ్యిందట.! ఇలాంటి అంశాలన్నీ తెరపైకొస్తున్నాయిప్పుడు. తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఈ విషయాల్ని ప్రస్తావిస్తుంది. వైసీపీ సంగతి సరే సరి.

‘నోటా’కే గుద్దేద్దామంటున్న తిరుపతి ఓటర్లు.?

బీజేపీ, కాంగ్రెస్‌ తదితర జాతీయ పార్టీలు, టీడీపీ, వైసీపీ, జనసేన తదితర ప్రాంతీయ పార్టీలు.. అన్నీ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశాయన్న భావన చాలామందిలో వుంది. అయితే, అప్పటి రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా అంశాల ప్రాతిపదికన ఆయా రాజీకీయ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపడం అనేది ఎన్నికల్లో సర్వసాధారణమే. కానీ, తిరుపతి ఉప ఎన్నిక చాలా ప్రత్యేకం. దెబ్బ కొడితే, ఢిల్లీలో గట్టిగా తగలాలన్న కొందరు తిరుపతి ఓటర్ల మాట నిజమైతే.. తిరుపతి ఉప ఎన్నికల్లో ‘నోటా’ గుర్తుకి భారీగా ఓట్లు పోలయ్యే అవకాశం వుందట. కానీ, ఇప్పటి ఈ వేడి.. అప్పటికి వుండకపోవచ్చు. ఆవేశం వేరు, ఆలోచన వేరు. కానీ, హోదా పేరుతో రాష్ట్ర ప్రజానీకం ఓడిపోయిందన్నది నిర్వివాదాంశం.