పిట్టంపల్లిలో కాలుష్యానికి వ్యతిరేకంగా గొంతెత్తిన పాట (వీడియో)

సెప్టెంబర్ 14వ తారీఖు నాడు వెలిమినేడులో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు పోరు ఉదృతమయ్యింది. కాలుష్య కంపెనీల వల్ల ఊరు నాశనం అవుతుందని ఇప్పటి వరకు చర్చలకే పరిమితమైన ఉద్యమం ఇప్పుడు ఆట పాటలతో కళాకారుల పాటల రూపంలో జనంలోకి వెళుతుంది. ప్రజలందరికి అర్ధం అయ్యేలా పాట రూపంలో కంపెనీల వల్ల జరిగే నష్టాలను వివరిస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో హిందీస్, దశమి ల్యాబ్ ల విస్తరణ వద్దని, యాక్టిరో కంపెనీకి అనుమతి ఇవ్వవద్దని ప్రజలు పోరాడుతున్న విషయం తెలిసిందే.పిట్టంపల్లి గ్రామంలో జరిగిన సభలో పాడిన పాట వీడియో కింద ఉంది చూడండి.

తాజాగా వెలిమినేడు చుట్టు ప్రక్కల గ్రామాలలో అవగాహన కల్పించేందుకు కళా బృందాలతో ప్రచారం చేస్తున్నారు. ఏ కాలికి గజ్జె కట్టి చిందేసి, ఏ గొంతుతో తెలంగాణ నినాదాన్ని ఎత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఇప్పుడు అదే డప్పుతో, అదే పాటతో పోరు బాట పట్టారు. వెలిమినేడులో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి జెండాలను పక్కకు పెట్టి పోరుబాట పట్టాయి. అధికార టిఆర్ ఎస్ పార్టీ వారు కూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు కూడా సమస్యను ప్రభుత్వ పెద్దలకు తెలియజేసి సానుకూలంగా సమస్యను పరిష్కరించేందుకు సహకరిస్తారని విద్యావంతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

పిట్టంపల్లి గ్రామంలో అవగాహన సభకు హాజరైన జనం

వెలిమినేడు చుట్టు గ్రామాలలో కూడా కాలుష్య విపత్తును తెలియజేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. సెప్టెంబర్ 14న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని దీనికి అందరూ సహకరించాలని వారు కోరారు.