దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర బీజేపీ నాయకులు పార్టీకి గొప్ప గొప్ప విజయాలను సాధించి పెడుతున్నారు. నెలరోజుల క్రితమే బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అఖండ విజయాన్ని సంపాదించి పెట్టారు ఆ రాష్ట్ర నాయకులు. నిన్నగాక మొన్న తెలంగాణ బీజేపీ సారధులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ లాంటివారు చాలా ధాటిగా పనిచేసి బీజేపీ బలాన్ని అమితంగా పెంచేశారు. కానీ, అన్నన్ని విజయాలను సాధించినవారు సైతం మేము మోడీ మనుషులం లేదా మోడీ ప్రతినిధులం అని చెప్పుకోవడానికి సాహసించలేదు ఇంతవరకు! జీవితంలో ఏనాడూ విజయం అంటూ ఎరుగని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు మాత్రం “మోడీ ప్రతినిధిగా చెబుతున్నా” అని ఒక ప్రజా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం చూసి నిఖిలలోకం నివ్వెరపోయి ఉంటుంది.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు..
హఠాత్తుగా ఎందుకింత ఆవేశం పొంగింది వీర్రాజు గారిలో? బండి సంజయ్ ను చూసి ప్రేరణ పొందారా? ఆ మాత్రం డైనమిజాన్ని తానెందుకు ప్రదర్శించలేకపోతున్నాని డీలా పడ్డారా? తెలంగాణ నాయకులకు లభిస్తున్న స్థాయి కవరేజ్ తనకు లభించడం లేదని మనోవేదనకు గురయ్యారా? తన స్థాయికి తగిన గుర్తింపు రాలేదని బాధపడుతున్నారా? కేసీఆర్ ను బండి సంజయ్ విమర్శించినంత దీటుగా తాను జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేకపోతున్నాని వగస్తున్నారా? బండి అలా దూకుడు ప్రదర్శించారంటే దానికో అర్ధం ఉంది. వారెవ్వరూ ఆంధ్ర బీజేపీ నాయకుల్లా కులపిచ్చి కలిగినవారు కారు. ఆంధ్రా బీజేపీ నాయకుల్లా చంద్రబాబుతో లాలూచీ పడి సొంతపార్టీకి ద్రోహం చేసినవారు కారు. చంద్రబాబు భజన చేస్తూ తమకు, తమ బంధుమిత్రులకు ప్రభుత్వ కాంట్రాక్టులు తెచ్చుకున్నవారు కారు. కాషాయం ముసుగు వేసుకుని చంద్రబాబు స్తోత్రాలు చేసేవారు కారు. అందుకనే వారు చెలరేగిపోతారు. మరి ఆంధ్రా బీజేపీ నాయకులకు ఆ చరిత్ర ఎక్కడుంది?
ఇవే మాటలు తిరుపతి వెళ్లి చెప్పగలరా?
ఇక అమరావతి విషయానికి వద్దాము. “మోడీ ప్రతినిధిగా చెబుతున్నా…రాజధాని అమరావతిలోనే ఉంటుంది” అంటూ నిన్న సోము వీర్రాజు ఒక శుష్కమైన ప్రకటన చేశారు. తన ప్రతినిధిగా మోడీ ఆయన్ను ఎప్పుడు నియమించారు? తదనుగుణంగా భారత రాష్ట్రపతి ఏదైనా ఫర్మానా జారీ చేశారా? మొన్నీమధ్యనే రాజధానులు మూడు ఉండాలో, ముప్ఫయి ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, కేంద్రం జోక్యం కల్పించుకోదు అంటూ చెప్పిన వీర్రాజు గారు అంతలోనే ఆ మాట మర్చిపోయి నాలుక మడతేయడం విడ్డూరంగా లేదూ? ఇదేమాట తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ వెళ్లి అక్కడ వేదికల మీద వీర్రాజు గారు ధైర్యంగా చెప్పగలరా? ఈ ఏడాది జనవరిలో ఆయనేమన్నారు? అమరావతి అనేది ఒక భ్రమ అన్నారు. చంద్రబాబు సృష్టించిన ఆ మాయాజాలంలో పడొద్దు అని ఆంధ్రప్రజలను హెచ్చరించారు. ప్రతి జిల్లాను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. రాయలసీమలో పరిశ్రమలు రావాలన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నదే తమ పార్టీ తీర్మానం అని కేకలు పెట్టారు.
తిరుపతిలో తిరుక్షవరం తప్పదని డిసైడ్ అయ్యారా?
మరి అవన్నీ గజనీ సినిమాలో హీరోమాదిరిగా ఇంతలోనే మర్చిపోయారా వీర్రాజు? పైగా తన మనసులో అమరావతి మీదనే భ్రమలు ఉన్నాయనుకుందాము. కానీ, కొద్ది రోజుల్లో రాయలసీమలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక రాబోతుండగా ఈ పరిస్థితుల్లో అమరావతికే మా మద్దతు అని చెప్పడం వెనుక మర్మం ఏమిటి? అలాంటి ప్రకటన పార్టీకి నష్టదాయకం అన్న స్పృహ లేదా? తిరుపతిలో గతంలో నోటకన్నా తక్కువ ఓట్లు వచ్చిన సంగతి మరిచారా? ఈసారి అవికూడా రాకుండా చెయ్యాలని శపథం చేశారా ఏమిటి? దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో ఒక చెంచా ఊరపిచ్చుక లేహ్యాన్ని చప్పరించి వారాంగనావాటికలో వేటకు వెళ్లిన వృద్ధుడిలా ఆంధ్రా బీజేపీ నాయకులు ఉరకలేస్తుంటే…తాజాగా వీర్రాజు గారి ప్రకటన బీజేపీ కొంప ముంచేట్లున్నదని బీజేపీ నాయకులు వాపోతున్నారు. భగవంతుడు మనకు నోరును ఇచ్చింది భగవన్నామస్మరణకే తప్ప బూతులు తిట్టడానికి కాదని పెద్దలు చెప్పినట్లు…వీర్రాజు గారికి అధ్యక్ష పదవి ఇచ్చింది పార్టీకి మేలు చేస్తారని తప్ప పృష్ఠము కింద పుల్లలు పెట్టి జ్వాలలు రగిలిస్తారని కాదు!