తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, సిట్టింగ్ ఎంపీ అకాల మరణం నేపథ్యంలో ఆ నియోజకవర్గం ఖాళీ అయ్యింది గనుక, ఖచ్చితంగా ఉప ఎన్నిక జరిగి తీరాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిపైనా దాదాపు స్పష్టత వచ్చేసినట్లే. అయితే, ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయనకు సాయపడిన వైద్యుడికి తిరుపతి లోక్‌సభ టిక్కెట్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ, తిరుపతి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న బీజేపీ మాటేమిటి.? బీజేపీ సంగతేమోగానీ, జనసేన పార్టీ మాత్రం తమ పార్టీ నుంచి ముగ్గురు నలుగురు అభ్యర్థులు సిద్ధంగా వున్నారనీ, ఎవరో ఒకర్ని ఖరారు చేయడానికి సిద్ధంగా వున్నామనీ ఆ పార్టీ చెబుతోంది.
అయితే, తిరుపతిలో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతారనీ, ఈ విషయమై బీజేపీ – జనసేన మధ్య స్పష్టత వుందనీ చెబుతున్న సోము వీర్రాజు, జనసేనతో ఓ పక్క మంతనాలు జరుపుతూనే, ఇంకోపక్క జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటన చేసెయ్యడం ఇరు పార్టీల మధ్యా గందరగోళానికి కారణమయ్యింది. ఇంతకీ, బీజేపీ ధీమా ఏంటి.? తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో సత్తా చాటినట్లుగా తిరుపతిలోనూ బీజేపీ గెలిచే అవకాశం వుందా.? అంటే, అంత సీన్ లేదుగానీ.. ఇప్పటినుంచే ‘హైప్’ క్రియేట్ చేస్తే, ఉనికి చాటుకోవచ్చన్న ఆలోచనతోనే సోము వీర్రాజు సహా బీజేపీ నేతల నుంచి ఈ ‘అతి ఉత్సాహం’తో కూడిన ప్రకటనలొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క, బీజేపీ – జనసేన.. గ్రౌండ్ లెవల్‌లో ఈక్వేషన్స్‌ని సెట్ చేసే పనిలో బిజీగా వున్నారట. తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైలెంట్‌గా బీజేపీ – జనసేన శ్రేణులు అన్ని వ్యవహారాల్నీ చక్కబెట్టేస్తున్నాయట.
ఈ క్రమంలోనే వారికి ‘కాస్త ఎడ్జ్ దొరుకుతుంది..’ అనే సంకేతాలు అందాయట. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని టీడీపీ ఖచ్చితంగా చీల్చుతుంది.. మూడు పార్టీల మధ్య పోరు గట్టిగా సాగితే, లాభం బీజేపీ – జనసేనకు వుండొచ్చని ‘కమలం పార్టీ వ్యూహకర్తలు’, జనసేన నేతల వద్ద ప్రస్తావించారట. అయితే, బీజేపీ అభ్యర్థి కంటే, జనసేన అభ్యర్థి బరిలో వుంటేనే మెరుగైన ఫలితం వస్తుందని ఇరు పార్టీల్లోనూ చర్చ జరుగుతుండడం గమనార్హం.