మూడు రాజధానుల వెనుక కేసీఆర్ ?

మూడు రాజధానుల వెనుక కేసీఆర్ ఉన్నారట.. ఎంత హాస్యాస్పదం
వైఎస్ జగన్ అమలుచేస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  కొందరు ప్రజలు సైతం అమరావతినే రాజధానిగా ఉంచితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  కానీ ఈ వ్యతిరేకత తీవ్రం రూపం దాల్చి ఉద్యమంగా మారుతుందా అంటే ఆ పరిస్థితులు కనబడటం లేదు.  ప్రతిపక్షం కూడా ఉద్యమాన్ని బిల్డ్ చేయడానికి సరైన పద్దతులు, ఎత్తుగడలు కనుగొనలేకపోతున్నాయి.  ఎంతసేపటికీ పసలేని వాదనలు, ప్రయోజనం లేని సవాళ్లు చేస్తూ నీరుగారిపోతున్నాయి.  తాజాగా అలాంటి వాదనను ఒకదాన్నే లేవదీశారు కొందరు అమరావతి మద్దతుదారులు.  అదే మూడు రాజధానుల నిర్ణయం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ఆరోపణ.  
 
వినడానికి ఆసక్తికరంగానే ఉన్న ఈ ఆరోపణ వెనక వాదన మాత్రం హాస్యాస్పదంగా ఉంది.  వైఎస్ జగన్ మీద మొదటి నుండి కేసీఆర్ చెప్పినట్టు వింటున్నారే విమర్శలు ఉన్నాయి.  జగన్, కేసీఆర్ సైతం విపరీతమైన స్నేహంతో మెలగడంతో ఆ విమర్శలకు బలం చేకూరింది.  ఇప్పుడు ఆ విమర్శలనే మూడు రాజధానుల వెనుక కేసీఆర్ ఉన్నారనే వాదనకు ఉపయోగిస్తున్నారు అమరావతి వాదులు.  అసలు అమరావతిని నిర్వీర్యం చేయమని జగన్ కు సలహా ఇచ్చిందే కేసీఆర్ అని అంటున్నారు.  కారణం అమరావతి భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని మించిపోతుందని, అలా జరిగే హైదరాబాద్ నగరానికి రావలసిన వేల కోట్ల పెట్టుబడులను కోల్పోతామనే ఆందోళనతో కేసీఆర్ పనిగట్టుకుని మూడు రాజధానుల ఐడియా ఇచ్చారట.  ఊహించడానికే పిచ్చ కామెడీగా ఉన్న ఈ వాదనను సదరు వ్యక్తులు టీవీ ఛానళ్లలో కూర్చొని ఘనంగా వినిపించారు.  
 
అసలు అమరావతికి, హైదరాబాద్ నగరానికి పోలిక పెట్టడమే పెద్ద బ్లండర్.  అసలు మూడు రాజధానుల కాన్సెప్టే లేదని, అమరావతే పూర్తిస్థాయి రాజధానని అనుకుందాం.  అప్పుడు అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ది చెందాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఆలోచించండి.   గత ఐదేళ్లలో చంద్రబాబుగారు డిజైన్లు, అవీ ఇవీ అంటూ తాత్కాలిక నిర్మాణాలకే పరిమితమయ్యారు తప్ప శాశ్వతమైన ట్రేడ్ మార్క్ భవనం ఒక్కటి కూడా కట్టలేదు.  అలాంటప్పుడు  హైదరాబాద్ స్థాయిలో అభివృద్ది చెంది ప్రపంచం దృష్టిని ఆకర్షించి విశ్వనగరంగా మార్పు చెందాలంటే కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది.  హైదరాబాద్ సైతం ప్రజెంట్ ఉన్న స్థాయికి ఎదగడానికి ఎన్నో చాలా కాలమే పట్టింది.  పైపెచ్చు అది వందల ఏళ్ళ మనుగడ కలిగిన నగరం.  అలాంటి నగరానికి అమరావతి పోటీ కావడమనే వాదన ఏమైనా నమ్మేలా ఉందా. 
 
కానీ కేసీఆర్ అందుకే భయపడుతున్నారనేది కొందరు మేధావుల వాదన.  నిజానికి అమరావతి కంటే వైజాగ్ సిటీనే హైదరాబాద్ నగరానికి పోటీగా నిలిచే అవకాశం ఉంది.  ఎందుకంటే వైజాగ్ పూర్తిగా అభివృద్ది చెందిన నగరం.  అన్ని రకాల పరిశ్రమలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోలెడంత మ్యాన్ పవర్, రోడ్డు, వాయి, జల మార్గాల రవాణా సౌకర్యాలు విశాఖకు ఉన్నాయి.  కష్టమైనా కూడా చిత్తశుద్దితో పనిచేస్తే హైదరాబాద్లోని సైబరాబాద్ లాంటి టెక్ సిటీని విశాఖలో కూడా ఏర్పాటు చేయవచ్చు.  అప్పుడు విశాఖలో బలమైన ఆర్థిక వ్యవస్థ ఒకటి సృష్టించబడుతుంది.  మంచి ఆర్థిక వ్యవస్థ ఉన్నచోటుకి పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి.  సో.. భాగ్యనగరానికి దీటుగా నిలబడగల అవకాశం అమరావతి కంటే విశాఖకే మెండుగా ఉన్నాయని స్పష్టమవుతోంది. 
 
ఈ లెక్కలు, విశ్లేషణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ గారికి తెలీకుండా ఉండవు కదా.  అలాంటప్పుడు ఆయనలో పోటీ భయమే ఉంటే, కుట్ర చేయాలనే ఉద్దేశ్యమే ఉంటే, అన్నిటికీ మించి ఆయన చెప్పినట్టు జగన్ వినే పరిస్థితే ఉంటే కేసీఆర్ ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్న అమరావతి హైదరాబాద్ సిటీని ఢీకొట్టాలంటే కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది కాబట్టి దాన్నే రాజధానిగా ఉంచమని సలహా ఇస్తారే తప్ప హైదరాబాద్ అభివృద్దిలో సగానికి పైగా అభివృద్దిని ఇప్పటికే పొంది ఉన్న విశాఖను రాజధానిని చేయమని చెప్పరు.  అయినా వచ్చే యేడాది పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీని ఈరోజుల్లో 20, 30 ఏళ్ళ తర్వాతి పరిస్థితిని తలచుకుని కేసీఆర్ భయపడతారంటే నవ్వుకోవచ్చు.  ఇన్ని రకాలుగా సిల్లీగా ఉన్న ఈ వాదననే మద్దతుదారులు, ఒక వర్గం మీడీయా అమరావతిని డిఫెండ్ చేయడానికి వాడటం నిష్ప్రయోజనం, నిరాశావాదం తప్ప మరొకటి కాదు.