రాత్రి పూట నిద్రను తక్కువ చేసి స్మార్ట్‌ఫోన్ స్క్రోలింగ్, వర్క్ ప్రెజర్, సినిమాలు.. ఇవన్నీ చిన్న విషయాలే అనిపిస్తున్నా, దీర్ఘకాలంలో ఇవే పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయి. నిద్ర లేనిదే రోజులు గడిపే వాస్తవం ఇప్పుడు చాలా మందికి అలవాటే అయిపోతోంది. అయితే ఈ అలవాటు ఒక్కో కొద్ది క్రమంగా శరీరాన్ని, మనసును క్రమంగా బలహీనపరుస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
భారతీయుల నిద్ర సమస్యలు ఎంత దారుణంగా ఉన్నాయో ఏజీఆర్ నాలెడ్జ్ సర్వీసెస్ నిర్వహించిన తాజా సర్వే చెప్పేస్తోంది. మన దేశంలో సుమారు 60 శాతం మంది రోజూ కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదని తేలింది. దాంతో నిద్రలేమి వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, జీవక్రియ సమస్యలు, చదువులో వెనకబాటు వంటి సమస్యలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.
తగినంత నిద్ర లేకుండా మన శరీరం ఎంతసేపు యుద్ధం చేయగలుగుతుంది.. రోజూ ఆరు గంటలు కూడా గాఢ నిద్ర లేకుండా ఉన్నవారి రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఊబకాయానికి దారి తీస్తుంది. దాంతో అనేక ప్రాణాంతక వ్యాధులు దగ్గర పడతాయి.
కేవలం శరీరం కాదు.. మనస్సూ నిద్ర కోసమే ఎదురుచూస్తుంది. నిద్రరాహిత్యం మన మనసులో ఒత్తిడి, ఆందోళనలకు దారి తీస్తుంది. చివరికి నిరాశ, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువే. నిద్ర రాకపోవడం వల్ల గుండె ఆరోగ్యం బలహీనమవుతుంది. గుండెపోటు లాంటి ప్రమాదాలను పెంచుతుంది.
నిపుణులు ఒకటే చెబుతున్నారు. రోజూ కనీసం ఆరు నుండి ఏడు గంటలు నిద్రపోవడం తప్పనిసరి. దీన్ని సాధించాలంటే ఫోన్ స్క్రీన్‌కు దూరంగా ఉండాలి. ఆలోచనలతో తల మునిగిపోకూడదు. సాధ్యమైతే ధ్యానం చేయాలి. ఇవన్నీ పాటిస్తేనే మన గుండెను, మనసును కాపాడుకోవచ్చు. (గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనుమానమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.)