చంద్రబాబుకు ఏమాత్రం అర్థం కాని విషయం ఇదొక్కటే…

 
 
(వి శంకరయ్య)
 
దిక్కు తోచని స్థితిలో టిడిపి అధినేత. సంక్షేమ పథకాల ప్రకటనే నిదర్శనం. 
 
ఎన్నికలు సమీపించే కొద్ది ఎపిలో టిడిపి శ్రేణులు కకావిక లౌతున్నాయి. రోజు కొక నేత అది కూడా యంపి గాని ఎమ్మెల్యే గాని పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అనూహ్యంగా రవీంద్ర బాబు జెండా పీకి ముఖ్యమంత్రి కి షాక్ ఇచ్చారు. 
 
సాధారణమైన రోజుల్లో పార్టీ ఫిరాయించడం వేరు. ఎన్నికల ముంగిట పెట్టుకొని గోడ దూకడంవేరు. మామూలు రోజుల్లో డబ్బులకు ఆశపడి లేదా అధికార లాంఛనాలకు మరీ చెప్పాలంటే కాంట్రాక్టుపనులకు లొంగి ప్రతి పక్షం నుండి గోడ దూకు తారు. కాని ఎన్నికలు ముందు పెట్టుకుని మరీ అధికార పక్షం నుండి ప్రతి పక్షంలోనికి దూకుతున్నారంటే ప్రలోభాలకు లొంగినారని చెప్పలేము. మునిగి పోయే పడవ నుండి బయట పడాలనే భావన తప్ప వేరు కాదు.
 
 
అంతేకాదు. ఎవరో ఒకరిద్దరు మారితే  ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయించారని భావించవచ్చు. ఎపిలో పరిస్థితి భిన్నంగా వుంది. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రిని చేయ బోయేనేత అధినేతగా వుండగా పైగా రోజు కొక సంక్షేమ పధకం ప్రకటించుతున్న నేపథ్యంలో అదీ ఓటుకు నోటు లాగా రెడీ క్యాష్ ఓటర్లకు అందిస్తున్నాఅధికార పార్టీ నుండి యంపిలు ఎమ్మెల్యేలు వెళ్లి పోతున్నారంటే ఏదో బలమైన కారణం వుండి తీరాలి.ఇందుకు ఎక్కడికో పోపని లేదు. ఏలూరులో వైసిపి బిసి సభ జరిపితే జనాలు తెలంగాణ నుండి తరలించారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారంటే వాళ్ళు ఎంత చీకటి కోణంలో వున్నారో అవగతం చేసుకోగలం. యుద్ధంలో ఎవరైనా సరే శత్రువును తగ్గించి అంచనా వేస్తే అపజయం తప్పదు. శత్రువు బలహీనంగా వున్నా చిన్న పామైనా పెద్ద కర్ర తో కొట్టాలనే నానుడి మరచి పోతే ఏలా? 
 
 
తొలుత కిషోర్ బాబు పోయారు. నాలుగు రోజులు గడచిందో లేదో మల్లి ఖార్ఖున రెడ్డి గుడ్ బై చెప్పారు. తదుపరి ఆమంచి షాక్ ఇచ్చారు. మరుస బెట్టి ప్రస్తుతం రవీంద్ర బాబు తో కలుపుకుని ఇద్దరు పార్లమెంటు సభ్యులు వెళ్లారు.ఈ లిస్ట్ లో ఇంకా ఎంత మంది వున్నారో? గమనార్హమైన అంశమేమంటే వైసిపి బలంగా వుండే రాయలసీమ ప్రాంతం నుండి కాకుండ కోస్తా ప్రాంతంలోనే ఎక్కువ మంది జెండా పీకే స్తున్నారు.
 
ఈ సందర్భంగా పలు అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అధికార పార్టీ నుండే వలసలు ఎక్కువగా వున్నాయంటే పడవ మునిగి పోతుందని భావించడం. అదే సమయంలో నాలుగన్నర ఏళ్లు పుణ్య కాలం సింగపూర్ సేవలో తరించడం పెట్టుబడుదారులకు తలొగ్గి నిరుపేద రైతులను భూములనుండి వెళ్ల గొట్టడంతో మూట కట్టుకున్న ప్రభుత్వం వ్యతిరేక పెను భూతంలాగా వెర్రి తలలు వేయడం గమనించిన పలువురు టిడిపి నేతలు తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని గోడ దూకు తున్నారు. ప్రస్తుతం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు జేసినా మూట గట్టు కున్న ప్రజా వ్యతిరేకత ముందు వెలవెల పోతాయని నేతలు భావించడమే వలసలకు కారణంగా వుంది. 
 
అంత వరకైతే ఫర్వా లేదు. ముఖ్యమంత్రి కూడా ఓడి పోతామనే భయం పట్టుకున్నందున ఆదివారం ఉదయం వరకు ఒక ఆలోచనలో వుండి పొద్దు గుంకే సరికి ప్రతి రైతు ఖాతాలో వేయి రూపాయల జమ చేసేందుకు సిద్ధం కావడం కూడా పలువురు టిడిపి నేతలు గోడ దూకేందుకు కారణంగా వుంది. ముఖ్యమంత్రికే ఇంత భయ ముంటే తమ పరిస్థితి ఏమిటని వలస బాట పడుతున్నారు. 
 
ముఖ్యమంత్రి ఎన్నికల వరాల స్పీడ్ పెంచే కొద్ది అదే సమయంలో అదే మోతాదులో టిడిపి నేతలు భయాందోళనకు గురై పార్టీ ఫిరాయింపుల మోతాదు పెరగ బోతోంది. ఈ రెండింటికి లోలకం ఒకటే.
 
 
(వి శంకరయ్య,సీనియర్ జర్నలిస్టు, ఫోన్ నెం. 9848394013)
 
 

ఈ వార్తలూ చదవండి

 

మరో టిడిపి ఎంపి రాజీనామా , చంద్రబాబుకు షాక్