వైసిపి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రాజకీయంగా సిఎం జగన్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో తనను ముప్పతిప్పలు పెట్టిన ప్రధాన ప్రతిపక్షం టిడిపిని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ పార్టీని దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఆ పనిలో బాగానే సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు వారి నుంచే కాకుండా అనూహ్యంగా వేరేవైపుల నుంచి ముప్పేట దాడి ని పెద్దఎత్తున ఎదుర్కోవలసి రావడం ఇబ్బందికరంగా మారింది. ప్రత్యర్థులు అంతకంతకూ పెరిగిపోవడం, మరొకవైపు న్యాయ స్థానాల నుంచి ప్రతికూల తీర్పులు…వీటితో సతమతమవుతున్న సిఎం జగన్ ను ఇప్పుడు సొంత పార్టీ నేతలు తమ దుందుడుకు, చేతగాని వ్యవహారాలతో మరింత ఇక్కట్లపాలు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే జగన్ ఈ వ్యవహారాలను వీలైనంత త్వరగా సరైన తీరులో అదుపు చేయలేకపోతే కుర్చీ కిందకు నీళ్లొచ్చినా ఆశ్చర్యం లేదనేంత వరకు వచ్చింది.
టిడిపి సరే…జనసేన,బిజెపి అదరగొడుతున్నాయి
సిఎం ఫీఠం అధిరోహించిన నాటి నుంచి గతంలో తనను అన్నివిధాలా ముప్పతిప్పలు పెట్టిన టీడీపీని దెబ్బతీసేందుకు జగన్ చేయని పని లేదు. ఆ క్రమంలో చాలా వరకు విజయం సాధించిన జగన్ అదే సమయంలో మరో వైపు న్యాయ స్థానాల నుంచి వరుస వ్యతిరేక తీర్పుల కారణంగా తానే ఇబ్బందుల్లో పడ్డారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపిని బాగానే దెబ్బతీశామనే సంతృప్తి చెందేలోపు అనూహ్యంగా జత కలసిన మరో రెండు విపక్షాలు జనసేన-బిజెపి కూటమిగా మారి ఊహించని బలం పుంజుకొని ఒక్కసారిగా మెరుపుదాడులకు దిగడంతో ఖంగు తినకతప్పలేదు. ఎలా జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయో జగన్ ప్రభుత్వం తెలుసుకోలేని విధంగా హిందూ దేవాలయాల్లో వరుస అపచార ఘటనలు చివరకు ప్రభుత్వ మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్వేది రధం దగ్థం ఘటనలో జనసేన-బిజెపి ఆందోళన వైసిపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టగా ఆ సంఘలనపై సిబిఐ విచారణకు ఆదేశించి హమ్మయ్యా అని జగన్ నిట్టూర్చారు.
అయినా ఇబ్బందులే…
అంతర్వేధి ఘటన నుంచి ఎలాగోలా తప్పుకున్నాములే అని నిట్టూర్చేలోగానే దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అవడం వెలుగుచూడటం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టింది. మరోవైపు శ్రీకాళహస్తిలో కొత్త విగ్రహాల చేరిక మరో వివాదానికి దారితీయగా ఇదే సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ అవసరం లేదంటూ టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఒక అంతర్వేది ఘటనతోనే ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించిన జనసేన-బిజెపి ఇక ఈ వరుస ఘటనలతో చలగాటం ఆడుతున్నాయి.
సొంత పార్టీ నేతల వ్యాఖ్యలతో ఇబ్బందులు
హిందూ దేవాలయాల్లో వరుస ఘటనలు జరుగతున్నా వాటిని నిలువరించడంలో విఫలమైన సంబంధిత శాఖ మంత్రివర్యలు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ వివాదాలపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు, పలు సార్లు మాటమార్చడం జగన్ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసిందని చెప్పకతప్పదు. అలాగే సమయాసమయాలు గమనించకుండా శ్రీవారి ఆలయ ప్రవేశం డిక్లరేషన్ విషయమై టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సిఎం జగన్ ను మరింత ఆత్మరక్షణ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి నెట్టాయి. ఇవన్నీ చాలవన్నట్లుగా దూకుడు వ్యాఖ్యలకు పెట్టింది పేరైన మంత్రి కొడాలి నాని తనకేమాత్రం సంబంధం లేకున్నా అటు టిటిడి డిక్లరేషన్, ఇటు హిందూ దేవాలయాల పై దాడులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఇటు జనసేన-బిజెపి కూటమికే కాదు ఏకంగా హిందూ సమాజం అందరికీ వైసిపి ప్రభుత్వం పై ఆగ్రహం వచ్చేలా పరిస్థితి మరింత క్లిష్టతరంగా మార్చారు.
మంచి బేస్ దొరికింది…
ఆంధ్రప్రదేశ్ లో సరైన బేస్ లేని బిజెపి ఆ బేస్ కోసమే జనసేనతో జత కట్టగా కలిసొచ్చే కాలం వస్తే…అన్న సామెత చందంగా ఆ పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా వేళ్లూనుకోవడానికి అవసరమైన అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు వీటి ద్వారా మరింత పాతుకుపోవడానికి, బలం పెంచుకోవడానికి హిందూ సమాజం మద్దతు తోడైంది. ఇక తామైదే కోరుకున్నామో అదే మార్గంలో ముందుకు సాగిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఇందుకు జగన్ పై ఉన్న క్రిస్టియానిటీ ముద్ర వీరికి ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఇకనైనా అదుపు చేయగలరా?
జగన్ దృష్గి కేంద్రకరిస్తే సొంత పార్టీ వారిని నిలువరించడం అంత కష్టమేమీ కాదు. జరుగుతున్న నష్టాన్ని బట్టి ఇక ఆ చర్యలు ఎలాగూ మొదలుపెట్టక తప్పదు. అయితే ప్రస్తుతం కొరకరాని కొయ్యలాగా మారుతున్న బిజెపి-జనసేన కూటమిని ఆయన ఎలా నిలువరిస్తారనేదే ప్రధానం. అయితే మొదట బిజెపిని కంట్రోల్ చేయగలిగితే తద్వారా జనసేనను అదుపు చేయొచ్చనేది వైసిపి శ్రేణుల ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు తాము కేంద్రంలో బిజెపి అవసరమైనప్పుడల్లా బేషరతుగా ఇస్తున్న మద్దతును ఇప్పుడు తమ అవసరానికి వాడుకోవాలని వైసిపి ముఖ్యులు నిర్ణయించారట. అంతేకాదు బిజెపిని ఢిఫెన్స్ లో పడేయడానికి ప్రత్యేక హోదా నినాదం కూడా మరింత బలంగా వినిపించాలని, తద్వారా బిజెపిని నిలువరించగలమని భావిస్తున్నారట. మరి సిఎం జగన్ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో వేచిచూడాలి.