బీజేపీలో టీడీపీని విలీనం చేపెయ్యడమొక్కటే చంద్రబాబు ముందున్న ఆప్షన్.!

ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఇవే చివరి ఎన్నికలు.. ఇదే చివరి అవకాశం.. అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా చంద్రబాబు ప్రయోగించేశారు. వాట్ నెక్స్‌ట్.! 2024 ఎన్నికలు ముందు చంద్రబాబు చాలా చాలా సిత్రాలు చేయబోతున్నారు. ‘నన్ను అవమానించారు, నా భార్యను అవమానించారు..’ అంటూ చంద్రబాబు వాపోతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అసలు చంద్రబాబు ఏం చెప్పి అధికారం పొందాలనుకుంటున్నారో జనానికి అర్థం కావడంలేదు.

సాధారణంగా అధికారంలోకి రావాలనుకునేవారెవరైనా ప్రజలకు ఏదో చేస్తామని చెప్పాలి. అంతే గానీ, ‘నా భార్యను అవమానించారు.. కాబట్టి, నాకు అధికారమివ్వండి..’ అంటూ చంద్రబాబు చెబుతుండడం ఆశ్చర్యకరమే. చంద్రబాబు ఏదైనా చెయ్యగలరు, ఏమైనా చెప్పగలరు. జనం నమ్మి తనను గెలిపించేస్తారన్న గుడ్డి నమ్మకం ఆయనది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ‘మీకు సిగ్గు లేదా.?’ అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయిన ఘనత ఆయనది.

నిజానికి, చంద్రబాబు ముందు ఇప్పుడు ఒకే ఒక్క ఆప్షన్ వుంది. టీడీపీని, బీజేపీలో విలీనం చేయడమే ఆ ఆప్షన్. ఆ విషయమై బీజేపీకి ఇప్పటికే చంద్రబాబుకి ఓ సూచన చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే, చంద్రబాబు ఈ బంపర్ ఆఫర్‌ని వదులుకోకూడదు. ఎందుకంటే, ఇలాంటి ఆప్షన్ ముందు ముందు చంద్రబాబుకి ఇంకోసారి దొరక్కపోవచ్చు. తెలంగాణలో టీడీపీ ఖేల్ ఖతమైపోయిందెప్పుడో.! 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ దుకాణం బంద్ కాబోతోంది.! చంద్రబాబే చెప్పేశారు కదా, ఇవి చివరి ఎన్నికలని.