కాంగ్రెస్ కు కోదండరాం జన సమితి షాక్

తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్, కోదండరాం పార్టీ జన సమితి ఫ్రెండ్లీ పార్టీలు అన్న ప్రచారం ఉంది. కొందరైతే కోదండరాం కాంగ్రెస్ మనిషే అని కూడా విమర్శలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోతాయని కొందరు అంటున్నారు. పొత్తు అధికారికంగా లేకపోయినా కనీసం సీట్ల సర్దుబాటు ఉంటుందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీతోపాటు జన సమితి, సిపిఐ, టిడిపి లాంటి పార్టీలన్నీ కలిసి తెలంగాణ మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని కూడా చర్చలు నడుస్తున్నాయి. కానీ తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కోదండరాం తేల్చి పారేశారు. తాము ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని పొత్తుల కోసం వెంపర్లాడేది లేదన్నారు. అంతేకాదు కొత్తగా పుట్టిన తమ పార్టీ పొత్తు కోసం ఆరాటపడితే పుట్టిన బిడ్డను చంపుకున్నట్లే అని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జన సమితి కూడా చాప కింద నీరులా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపింది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఫ్యామిలీ, పెద్ద లీడర్ గా ఉన్న నాయకుడి కొడుకును జన సమితి పార్టీలో చేర్చుకుని హస్తం పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది జన సమితి. వివరాల కోసం కింద స్టోరీ చదవండి.

తెలంగాణ జన సమితిలో చేరిన మర్రి ఆదిత్య రెడ్డి

దివంగత నేత మర్రి చెన్నారెడ్డి పేరు వినగానే అందరికీ తొలి దశ తెలంగాణ ఉద్యమం గుర్తొస్తది. అప్పట్లో ఆయన తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టారు. తర్వాత తిరిగి కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇదంతా చరిత్ర. ఆయన కొడుకు మర్రి శశిధర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన మాజీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సిన్సియర్ అండ్ డీసెంట్ పొలిటీషియన్ గా మర్రి శశిధర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి పెద్ద కొడుకు మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పార్టీ అధినేత కోదండరాం ఆయనకు కండవా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

మర్రి ఆదిత్య రెడ్డి చేరిన సందర్భంగా జన సమితి ఆఫీసులో అభివాదం

మర్రి ఆదిత్య రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటే టికెట్ వచ్చుడు కూడా కష్టమే అన్న భావనతో ఆయన తెలంగాణ జన సమితిలో చేరినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజా సమితి పార్టీ ని ఏర్పాటు చేసిన సమయంలో మర్రి చెన్నారెడ్డి ఏ ఆఫీసులో అయితే పార్టీని నడిపారో ఇప్పుడు అదే ప్రాంగణంలో ఇప్పుడు తెలంగాణ జన సమితి పార్టీ నడుస్తున్నది. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మనవడు, శశిధర్ రెడ్డి పెద్ద కొడుకు ఆదిత్య రెడ్డి తాత నడిపిన పార్టీ కార్యాలయం ఆవరణలోనే జన సమితి పార్టీలోకి చేరడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పిసిసి సెక్రటరీగా పనిచేస్తున్నారు. అమెరికాలో ఎంబిఎ చదివారు. మర్రి చెన్నారెడ్డి ట్రస్టుకు ప్రస్తుతం ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.

మర్రి శశిధర్ రెడ్డి పెద్ద కొడుకుకు కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటున్న కోదండరాం

ఈ సందర్భంగా మర్రి ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ కోదండరాం ఇచ్చిన ఇనిస్పెరెషన్ తోనే ఇక్కడికి వచ్చానని అన్నారు. చాలా రోజులనుండి కోదండరాం స్పీచ్ లు వింటూ ఉండే వాడిని అన్నారు. తెలంగాణ రావాలని బలంగా కోరుకునే వాడిని అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడ కోదండరాం చేస్తున్న పోరాటం నాలో స్పూర్తి నింపిందన్నారు. చిన్నప్పటి నుంచి తాను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పారు. తెలంగాణ వచ్చినా తెలంగాణలో చాలామంది ఇబ్బందులు ఇంకా తీరలేదన్నారు. సమస్యలపైనా నాన్నను తాతను కూడా ప్రశ్నించే వాడిని అని గుర్తు చేసుకున్నారు. టిఆర్ఎస్ సర్కారుపై గ్రామాల్లో ప్రజలు నిరాశతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.