వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టనున్న కొత్త రాజకీయ పార్టీతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి లైన్ క్లియర్ అయ్యిందనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ దెబ్బకి తెలుగుదేశం పార్టీ కుదేలయ్యింది. అయితే, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ గ్రౌండ్ లెవల్‌లో క్యాడర్ బలంగా వుంది. అది స్వర్గీయ నందమూరి తారకరామారావు మీద అభిమానంతో కావొచ్చు.. చంద్రబాబు పాలన కారణంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న జనాభిప్రాయం కావొచ్చు.. కారణం ఏదైతేనేం, తెలంగాణలో టీడీపీకి ఇంకా ఉనికి వుందన్నది నిర్వివాదాంశం. షర్మిల పార్టీ గనుక తెలంగాణలో పురుడు పోసుకుంటే, నూటికి నూరు పాళ్ళూ తెలుగుదేశం పార్టకి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సమయం కోసం తెలంగాణలో పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు.
వీరంతా వివిధ కారణాలతో టీడీపీని వీడి, ఇతర పార్టీల్లో చేరినవారే. ఆంధ్రపదేశ్‌లో ఎటూ తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ ప్రాభవం కోల్పోతోంది. ఈ తరుణంలో చంద్రబాబు కాస్త ఫోకస్ పెడితే, తెలంగాణలో టీడీపీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. ‘షర్మిల పార్టీ అంటున్నారు.. ఆ తర్వాత చంద్రబాబు కూడా వస్తారు.. మళ్ళీ తెలంగాణలో కొట్లాటలు తప్పవు..’ అంటూ టీడీపీ ముఖ్య నేత ఒకరు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆయన కూడా ఒకప్పటి టీడీపీ నేత కావడం గమనార్హం. ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒకప్పటి టీడీపీ నేత. గులాబీ పార్టీలో చాలామంది మాజీ టీడీపీ నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే. కాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య సెగ ఎక్కువయ్యింది. టీడీపీకి తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా వుంటే, అందరికన్నా ముందే సొంతింటికి చేరేది రేవంత్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్, టీడీపీని వీడాకే.. ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యింది. కాగా, రేవంత్ సహా పలువురు మాజీ టీడీపీ నేతలతో, చంద్రబాబు ఈ మధ్య టచ్‌లోకి వచ్చారంటూ ఊహాగానాలు వినిపిస్తుండడం గమనార్హం.