పీసీబీ మంగళవారం మాటలపై షాహిద్ అఫ్రిది ఫైర్!

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ప్రపంచకప్‌ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ ను బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది. అనంతరం ఈ ఈ ముసాయిదా షెడ్యూల్‌ ను బీసీసీఐ.. ఐసీసీతో పంచుకుంది. ఐసీసీ ఆమోదం అనంతరం మిగతా దేశాలకు ఈ షెడ్యూల్‌ ను అందిస్తారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… అక్టోబర్ 15న దాయాదుల పోరు ఉండనుంది. అవును… అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈవార్త క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) స్పందించింది. ఆ స్పందనపై పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.

వన్డే ప్రపంచ కప్‌ కోసం తమ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్‌ కు వెళ్తామని తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజం సేథి వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ సీనియర్స్ కానీ, ఇతర క్రికెటర్లు కానీ ఎవరూ స్పందించలేదు. అయితే అనుమతి ఇచ్చినా అహ్మదాబాద్‌ లో ఆడతామో…? లేదో? ఇప్పుడే చెప్పలేమని పీసీబీ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై మాత్రం అఫ్రిద్ ఘాటుగా స్పందించాడు.

“అహ్మదాబాద్‌ పిచ్‌పై ఎందుకు ఆడకూడదని అనుకుంటున్నారో మీరు చెప్పగలరా..? అదేమైనా నిప్పులు కురిపిస్తుందా..? లేకపోతే వేటాడుతుందా?” అని తీవ్రస్థాయిలో ప్రశ్నించిన అఫ్రిది… అనంతరం పీసీబీకి కీలక సూచనలు చేశాడు. “మీరు వెళ్లి అక్కడ ఆడాలి. విజయం సాధించాలి. భారత్‌ ను వారి సొంత గడ్డపై ఓడించడానికి వచ్చిన అవకాశాలపై పీసీబీ దృష్టిపెట్టాలి. అంతేకానీ వెనుకడుగు వేయకూడదు” అని హెచ్చరిస్తూనే.. ఒకింత ఉత్సాహపరిచే వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి.

కాగా.. బీసీఐ విడుదల చేసిన ప్రపంచ కప్ – 20232 ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం… భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

అక్టోబర్‌ 8 – చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో

అక్టోబర్‌ 11 – ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌ తో

అక్టోబర్‌ 15 – అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌ తో

అక్టోబర్‌ 19 – పుణె వేదికగా బంగ్లాదేశ్‌ తో

అక్టోబర్‌ 22 – ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌ తో

అక్టోబర్‌ 29 – లఖ్‌ నవూ వేదికగా ఇంగ్లాండ్‌ తో ఆడనుంది. అనంతరం క్వాలిఫైర్ మ్యాచ్ లు జరగనున్నాయి!!