మోడీ ఒక్క రోజూ సెలవు తీసుకోలేదు… నెటిజన్ల సెటైర్స్ పీక్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 నుంచి 2019 వరకూ ఎన్ని సెలవులు తీసుకున్నారు.. ఎన్ని పర్యటనలకు వెళ్లారు అనే విషయాలపై సమాచార హక్కు చట్టం ద్వారా ఒక ప్రశ్న వేశారు. ఈ విషయాలపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది. మోడీ ఇప్పటివరకూ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదని తెలిపింది.

అవును… ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదని.. నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దీంతో బీజేపీ నేతలు ఈ విషయాలను ఆన్ లైన్ వేదికగా షేర్ చేసుకుంటూ… మోడీపై ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బండి సంజయ్ ఇదే విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన బండి సంజయ్… “ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పూర్తిదాయకమైన వ్యక్తి. ఇన్నేళ్ల కాలంలో ఆయన ఏనాడూ సెలవు తీసుకోలేదు. తన తల్లి మరణించిన రోజు కూడా ప్రధాని డ్యూటీలోనే ఉన్నారు. కానీ కొంత మంది నేతలు మాత్రం ట్రెక్కింగ్‌ కు వెళ్తుంటారు. ఫార్మ్ హౌస్‌ లో గడుపుతుంటారు” అంటూ రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్‌ ను పరోక్షంగా ఉద్దేశించి బండి వ్యాఖ్యలు చేశారు!

ఇలా మోడీని పొగుడుకుంటే పర్లేదు కానీ… మద్యలో రాహుల్ గాంధీ ట్రెక్కింగ్ కు వెళ్లిన విషయాన్ని, కేసీఆర్ ఫాం హౌస్ లో ఉంటారనే సందర్భాన్ని ప్రస్థావించడంతో బండి సంజయ్ కి కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. ఉదయం లేస్తే హిందుత్వం కబుర్లు చెప్పే వ్యక్తులు… తల్లి చనిపోతే తలనీలాలు ఇవ్వారా.. గుండు గొట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు!

ఇదే సమయంలో సెలవులు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారంటే… కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం అవుతోందని మరొకరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో తల్లి మరణిస్తే ఆ కార్యక్రమం అనంతరం ఆఫీసులో ఉన్నారని, ఆన్ డ్యూటీ అని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదంటూ స్పందిస్తున్నారు!

ఇదే క్రమంలో… ట్రెక్కింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది అనే విషయం బండి సంజయ్ కు తెలియదా అనేది మరొకరి ప్రశ్న కాగా… వారాంతంలో ఫార్మ్ హౌస్‌ లో విశ్రాంతి తీసుకుంటే.. తర్వాత మరింత ఉత్సాహంగా పని చేయవచ్చనే సంగతి కూడా తెలియదా.. అవేమీ చెడు అలవాట్లు కాదు కదా అనేది ఇంకొకరి రియాక్షన్ గా ఉంది. ఇలా మోడీ నో లీవ్స్ పై సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.

ఇదే సమయంలో మోడీ ఫారెస్ట్ టూర్స్ కి వెళ్లిన ఫోటోలు పోస్ట్ చేస్తూ… ఇది ఏ ప్రధాన మంత్రి కార్యాలయమో చెప్పగలరా అంటు కామెంట్లు పెడుతున్నారు. దీంతో… ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. బీజేపీ నేతల ట్వీట్ల కు రిప్లైలుగా వైరల్ అవుతున్నాయి.