భారత్ జెండా ఎగరవేసిన పాక్ మహిళ… వీడియో వైరల్!

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశం మొత్తం త్వివర్ణమై వెలుగొందుతోంది. త్యాగానికి, శాంతికి, పాడిపంటలకు, ధర్మానికి ప్రతీకలైన రంగులు, గుర్తుతో త్రివర్ణ పథాకం రెపరెపలాడుతోంది. ఈ సమయంలో పాకిస్థాన్ కు చెందిన ఒక మహిళ జాతీయ జెండాను ఎగరవేసి.. భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అవును… పబ్జీలో ఉత్తరప్రదేశ్‌ కు చెందిన యువకుడితో పరిచయమై అదికాస్తా ముదరడంతో పాక్ నుంచి అక్రమంగా నలుగురు పిల్లలతో భారత్ వచ్చేసింది సీమా హైదర్ అనే మహిళ. గత కొన్ని రోజులుగా ఏదో విధంగా ఆమె మీడియాలో నానుతూనే ఉంది! ఇండియాకు రావడం, అనంతరం పోలీసుల విచారణ.. ఈ గ్యాప్ లో సినిమా ఛాన్స్ లతో వైరల్ గా మారింది ఈమె వ్యవహారం.

ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్‌ లో పాల్గొని మరోసారి దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు భారతదేశ గొప్పతనాన్ని కొనియాడుతూ తన భర్త సచిన్‌ మీనా, వారి తరఫున లాయర్‌ ఏపీ సింగ్‌ తో కలిసి ఆమె మువ్వన్నెల జెండాను ఎగరవేసింది.

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో తన నివాసంలో జరిగిన “హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్”లో పాల్గొంది. ఈ సందర్భంగా జెండాను ఎగురవేసిన తర్వాత.. హిందుస్థాన్ జిందాబాద్‌, భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. త్రివర్ణ పతాకం వంటి దుస్తులు కూడా ఆమె ధరించింది!

కాగా… పాకిస్థాన్‌ కు చెందిన సీమా హైదర్‌ కు 2019లో పబ్జీ గేమ్‌లో ఉత్తరప్రదేశ్‌ నోయిడాకు చెందిన సచిన్ మీనా పరిచయమయ్యాడు. కొన్ని రోజులకు ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పాక్ నుంచి ప్రియుడి కోసం ఇండియాకు వచ్చేయాలని బలంగా ఫిక్సయ్యింది.

ఇందులో భాగంగా పాక్ లో భర్తతో విడిపోయింది. ఫలితంగా తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసింది. అనంతరం ఆ డబ్బులు తీసుకుని సచిన్ మీనా తన నలుగురు పిల్లలతో సహా భారత్‌ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. విషయం ఇంటెలిజెన్స్ వారికి తెలిసింది. విచారణ అనంతరం ప్రస్తుతం బెయిల్ పై ఉంది.