“ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు అని బయట అందరూ అంటుంటారు.. దానికి మీరేమంటారు?” కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన ఒక డైలాగ్ ఇది. ప్రస్తుతం పవన్ కూడా అలానే మాట్లాడుతున్నారా? అంటే అవునని అంటున్నారు వాలంటీర్లు!
అవును… ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని వాలంటీర్లపై పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు! ఆధారాలు లేని, తను చెప్పలేని, ఆరోపణల్ని వాలంటీర్లపై గుప్పించారు. ఏకంగా వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి ఒక ప్రధాన కారణం అనేస్థాయిలో మాట్లాడేశారు.
దీంతో విజ్ఞత మరిచి, ఇంగితం విడిచి, సంస్కారం వదిలి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అంటూ వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. దిష్టిబొమ్మలు తగలుబెట్టారు. పవన్ ఫోటోలను చెప్పులతో కొట్టారు. పలు చోట్ల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఈ సమయంలో ఏపీ మహిళా కమిషన్ పవన్ కు నోటీసులు కూడా ఇచ్చింది.
ఈ సమయంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తే.. ప్రత్యర్థుల మీద బురద చల్లడే క్రమంలో… మధ్యలో ప్రభుత్వ వ్యవస్థలను కూడా బజారుకీడుస్తూ చులకనగా మాట్లాడితే… అందరూ చూస్తూ ఊరుకుంటారని అనుకోవడం భ్రమ. ప్రస్తుతం ఇదే విషయాన్ని జగన్ సర్కార్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా… ఆయన మీద ప్రాసిక్యూషన్ కు ఆదేశిస్తూ జీవో జారీచేసింది.
అవును… వారాహి యాత్రలో ఏలూరు సభలో అన్నమాటలపై.. పవన్ పై కేసు నమోదు చేసేందుకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎన్సీఆర్డీ నివేదిక ప్రకారం ఏపీలో మొత్తం 29 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని అన్నారు. 14వేల మంది ఆచూకీ మత్రం పోలీసులకు దొరికిందని అన్నారు.
ఈ నిరాధార ఆరోపణలతో వాలంటీర్ల వ్యవస్థ పరువు తీశారనే ఆరోపణతో ఆయన మీద సీ.ఆర్.పీ.సీ 199(4) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఈ జీవో పై కూడా పవన్ రెచ్చిపోతున్నారు. తాను ఏ విషయం కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడని, పర్యవసానాలు ఏమైనా సరే సిద్ధంగా ఉంటానని ఆయన అంటున్నారు.
అయితే పవన్ పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా… 29వేల మంది మహిళలు అదృశ్యం అయినట్టుగా, అక్రమరవాణా అయినట్టుగా నిరూపించి చూపించడం ఒక పట్టాన తేలే సంగతి కాదనేది పలువురి అభిప్రాయంగా ఉంది. తాను చేసిన ఆరోపణలకు ఆయన ఆదారాలు చూపడం కష్టం అని చెబుతున్నారు. అయితే 14వేల మంది మహిళలు దొరికారని పవన్ చెబుతున్నారు కాబట్టి… అది నిజమైతే ఆ లిస్ట్ పోలీసుల దగ్గర ఉండొచ్చని అంటున్నారు
ఈ పరిస్థితుల్లో న్యాయపరంగా ఆయనకు ప్రతికూల వాతావరణం ఉండొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారని తెలుస్తుంది. సీఆర్పీసీలో ఈ సెక్షన్ 199(4) కింద చేసే నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష పడుతుంది. పవన్ ఈ మాటల ద్వారా.. రెండున్నర లక్షల మంది వాలంటీర్ల ప్రతిష్ఠను దెబ్బతీశారని ప్రభుత్వం కోర్టులో గట్టిగా వాదన వినిపిస్తే గనుక.. ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకుడు జైలుకు వెళ్లినా సానుభూతి దొరికే ఛాన్స్ తక్కువని అంటున్నారు. ఇలా రెండేళ్ల జైలుశిక్ష పడిందంటే.. పవన్ రాజకీయ జీవితం అక్కడితో అంతం అవుతుంది. అప్పీలుకు అవకాశం ఉంటుంది గానీ.. జైలుశిక్ష పడ్డ తర్వాత.. ఆయన ఎన్నికల్లో పోటీచేయడానికి ఉండదు. ఆరేళ్లపాటు ఎన్నికలకు దూరం అవుతారు!