ఊహించని పరిణామం: కేసీఆర్ కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్!

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండటంతో… పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వచేశాయి. ఈ క్రమ్మలో ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించుకున్న బీఆరెస్స్ నేతలు…. తాజాగా టీఆరెస్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ చేసిన ఒక వ్యాఖ్య… నేడు కాంగ్రెస్ నేతలు ఈడీ కి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం. కేసీఆర్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ లాంటిది!!

తాజాగా జరిగిన టీఆరెస్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో… బీఆరెస్స్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్… కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు పేరుతో డబ్బులు వసూలు చేశారని, ఆ చిట్టా మొత్తం తన వద్ద ఉందని ప్రకటించారు. ఇదే రిపీట్ అయితే మాత్రం పార్టీ టిక్కెట్ కాదు.. పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుచరులు తీసుకున్నా కూడా.. ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ ఇదే తన చివరి వార్నింగ్ అంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

సరిగ్గా ఇదే పాయింట్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఫిర్యాదు చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈమేరకు ఈడీకి ఫిర్యాదు చేశారు. దళితబంధు, డబుల్ బెండ్రూం పథకాల్లో బీఆరెస్స్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు లక్షల రూపాయల కమీషన్లు వసూలు చేశారనే విషయం.. పార్టీ మీటింగ్‌ లో స్వయంగా సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కమీషన్లు తీసుకుంటున్న వారి చిట్టా తన దగ్గర ఉన్నట్లు పార్టీ మీటింగ్‌ లో కేసీఆర్ వెల్లడించారని ఫిర్యాదులో ప్రస్తావించిన జడ్సన్… ఈ కుంభకోణంపై విచారణ జరపాలని ఈడీని అభ్యర్థించారు. అదేవిధంగా… కమిషన్లు తీసుకున్న నేతల పేర్లు కూడా తెలిసినా… వాటిని దాచడం సబబు కాదని కేసీఆర్‌ కు సూచించారు. వెంటనే వాటిని చట్టానికి అందించాలని ఈ సందర్భంగా జడ్సన్.. సీఎం ను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. దీంతో… “ఇది ఒక హఠాత్ పరిణామం – ఎవరూ ఊహించింది కాదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు!