టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన వ్యక్తిగత జీవితంతో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్లకు తెరదిస్తూ, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోర్‌తో సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ ప్రశాంత వాతావరణంలో, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానుల్లో సంబరాలు రేపాయి.
సామ్-రాజ్ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తుండగా.. అదే సమయంలో కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ పెళ్లిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేయడంతో ఈ వివాహం మరోసారి చర్చకు కేంద్రంగా మారింది. ఇదే సమయంలో, గతంలో సమంత డైవోర్స్ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున పాపులారిటీ తెచ్చుకున్న వేణు స్వామి ఈ పెళ్లిపై ఏమంటారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో వేణు స్వామి స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్. సమంత రెండో పెళ్లి గురించి అడుగుతూ వరుసగా ఫోన్ చేస్తున్నారు. వాళ్ల భవిష్యత్ ఎలా ఉంటుంది.. ఈ పెళ్లి నిలుస్తుందా.. విడిపోతారా.. అంటూ ప్రశ్నల వర్షం అని ఆయన ఒక వీడియోలో తెలిపారు. గతంలో తాను నాగ చైతన్య-శోభిత వివాహంపై వ్యాఖ్యానించినప్పుడు విమర్శలు చేసిన వారంతా ఇప్పుడు మళ్లీ జ్యోతిష్యులను వెతుక్కుంటూ తిరుగుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అయితే ఈసారి మాత్రం వేణు స్వామి పూర్తిగా భిన్నంగా స్పందించారు. ప్రస్తుతం తాను ఓ సినిమా సక్సెస్ కోసం పూజలు, యాగాలు చేస్తున్నాను. అందుకే ఇతరుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడే సమయం కూడా లేదన్నారు. ఎవరి పెళ్లి వాళ్లది. ఇప్పుడు నేను నా పనిలో బిజీగా ఉన్నాను అంటూ స్పష్టంగా చెప్పారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు.
ఈ వ్యాఖ్యల తర్వాత వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సమంత పెళ్లిపై భవిష్యవాణి కోసం ఎదురుచూసిన నెటిజన్లకు వేణు స్వామి ఇచ్చిన ఈ కూల్ రియాక్షన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉండటంతో మరోసారి ఇంటర్నెట్‌లో చర్చ మొదలైంది. ఒక వైపు పెళ్లి సెలబ్రేషన్స్, మరోవైపు సెలబ్రిటీ రియాక్షన్స్.. ఇవన్నీ కలిసి సమంత పేరు ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది.
