తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వాతావరణం గుంభనంగా ఉంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. తుఫాన్ ముందు ప్రశాంతతలా ఉంది. రానున్న విపత్కర పరిణామాలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై అధిష్టానం తలమునకలైంది. ఇందులో భాగంగానే సిఎల్పీ నేత ఎన్నిక ఇంకా వాయిదా పడుతూ వస్తున్నది. ఇంతకూ తెలంగాణ కాంగ్రెస్ లో అంతటి విపత్కర పరిణామాలు ఏమున్నాయి? సిఎల్పీ నేత ఎన్నికకు దానికి లంకె ఏంటి? సిఎల్పీ రేస్ లో ఉన్న ఆ ఇద్దరు నేతలెవరు? చదవండి.
ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. సభ్యుల ప్రమాణ స్వీకారం అయిపోయింది. స్పీకర్ ఎన్నిక జరిగిపోయింది. కానీ రెండు విషయాల్లో మాత్రం క్లారిటీ రావడంలేదు. అందులో…
ఒకటి సిఎల్పీ నేత ఎవరుంటారనేది తేలాల్సి ఉంది. ఈ అంశాన్ని తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.
రెండోది మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతున్నది అనేది కూడా తేలాల్సి ఉంది.
అయితే ఈ రెండు అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చర్చ ఉంది. ఈ రెండు అంశాల్లో ఇటు అధికార టిఆర్ఎస్ అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటున్నాయి. అంతిమంగా రెండు పార్టీలూ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశమాలు ఆరంభమైనా కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత ఎన్నికను పూర్తి చేయలేదు. సిఎల్పీ నాయకుడు ఎవరైతే వారే ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారు. అటువంటి కీలక పోస్టును భర్తీ చేయకుండా కాంగ్రెస్ నాన్చడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సిఎల్పీ నేత రేస్ లో ముందు వరుసలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి చాన్స్ ఉంటుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
సబితా ఇంద్రారెడ్డి ఎంపిక వెనుక కాంగ్రెస్ హైకమాండ్ చాలా పెద్ద కసరత్తే చేసినట్లు చెబుతున్నారు. తెలుగు నేల మీద ఇప్పటి వరకు సిఎల్పీ నేతగా మహిళకు అవకాశం రాలేదు కాబట్టి సబితను ఆ పదవిలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందంటున్నారు.
అంతేకాకుండా తెలంగాణలో టిఆర్ఎస్ సర్కారు తొలి టర్మ్ లో ఒక్క మహిళను కూడా మంత్రివర్గంలోకి తీసుకోకుండా పాలన సాగించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉండబోదన్న ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళకు అత్యున్నత పదవిని ఇవ్వడం ద్వారా టిఆర్ఎస్ ను మహిళా సమాజంలో ఎక్స్ పోజ్ చేయాలన్న ఉద్దేశం కూడా దాగి ఉండొచ్చని సమాచారం.
ఇక రేస్ లో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి మల్లు బట్టి విక్రమార్క. ఆయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఎక్కువ చాన్సెస్ సబితా ఇంద్రారెడ్డికే ఉన్నట్లు చెబుతున్నారు. మల్లు బట్టి విక్రమాార్క పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో ఉన్నాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సర్వీస్ ను పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు.
మల్లు బట్టి విక్రమార్కను సిఎల్పీ నేతగా నియమిస్తే తనకు సమ్మతమే అని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైకమాండ్ కు తన సమ్మతిని తెలియజేసినట్లు తెలిసింది. మల్లు బట్టి విక్రమార్క విషయంలో మిగతా సీనియర్లు వ్యతిరేకించే చాన్సెస్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
వీరే కాకుండా సిఎల్పీ రేస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్లు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయమే శిరోధార్యం అంటూనే తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు.
అయితే సిఎల్పీ నేత పేరు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించే ప్రయత్నాల్లో టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సిఎల్పీ నేత చాన్స్ దక్కలేదన్న కారణంతో కొందరు కాంగ్రెస్ ను వీడే చాన్స్ ఉందన్న సమాచారం అధిష్టానంలో కలవరం రేపుతున్నది. అందుకే సిఎల్పీ నేత పదవి ఎంపికను ఆలస్యం చేసినట్లు వార్తలొస్తున్నాయి.
సిఎల్పీ నేత ప్రకటన జరిగిన తర్వాతే మంత్రి వర్గ విస్తరణకు కేసిఆర్ పూనుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలోకి గుంజుకుని కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతు చేయడమే కాకుండా పార్టీ ఫిరాయించిన వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టాలన్న ఆలోచతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మరి ఈ గండాన్ని కాంగ్రెస్ పెద్దలు ఎలా గట్టెక్కుతారో చూడాలి.
సబితా ఖాతాలో మరో రికార్డు
మరో విషయం ఏమంటే? సబితా ఇంద్రారెడ్డి తెలుగు నేల మీద తొలి మహిళా హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు నెలకొల్పారు. ఆమె వైఎస్ కేబినెట్ లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మరో రికార్డు చేరువలో సబితా ఇంద్రారెడ్డి అడుగులు వేస్తున్నారు.