టిఆర్ఎస్ ఎత్తుకు కాంగ్రెస్ పై ఎత్తు… కానీ చిత్తయ్యేదెవరో ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించి టిఆర్ఎస్ ఆనందంలో ఉంటే కూటమి ఫెయిల్ కావడంతో కాంగ్రెస్ దిక్కుతోచని రీతిలో ఉన్నది. అయితే ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బొటాబొటీగా గెలిచిన కాంగ్రెస్ ను కేసిఆర్ కలవరపెడుతున్నారు. ఏ క్షణంలో కాంగ్రెస్ కు ఉన్న 19 మందిలో ఏ ఎమ్మెల్యే జారిపోతాడోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అయితే కేసిఆర్ వేసిన ఎత్తును చిత్తు చేసేందుకు కాంగ్రెస్ పై ఎత్తు వేసింది. కానీ అది తాత్కాళికంగానే కాంగ్రెస్ కు కలిసి వస్తుందా? లేదంటే ఇంకొంతకాలం నిలబడగలుగుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. అసలు విషయం చదవండి.

డిసెంబరు 11వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టిఆర్ఎస్ గెలిచింది. వెంటనే సభ్యుల ప్రమాణం, మంత్రివర్గం కూర్పు చకచకా జరిగిపోతాయని రాష్ట్ర ప్రజలు భావించారు. సాధారణంగా ఎక్కడైనా జరిగేది అదే కదా అందుకే తెలంగాణలో అందరూ అలాగే భావించారు. కానీ కేసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో కాంగ్రెస్ ను మరింత చిత్తు చేయాలని భావించినట్లు చెబుతున్నారు. అందుకోసమే నెలరోజులైనా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అసెంబ్లీ సమావేశం కాలేదు. కేవలం ఒకే మంత్రితో నెట్టుకొస్తున్నారు కేసిఆర్.

అందులో భాగంగానే అసలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కంటే ముందే కాంగ్రెస్ సభ్యులను గుంజిపారేయాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ సభ్యులు ఇప్పుడే రాలేమని ఆపరేషన్ ఆకర్ష్ వల వేసిన టిఆర్ఎస్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయినా చేయకముందే పార్టీ మారితే నియోజకవర్గాల్లో గెలిచిన పేరు కూడా పోగొట్టుకున్నవాళ్లం అవుతామని వారు తేల్చి చెప్పారని అంటున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సరైన ముహూర్తం చూసుకుని గులాబీ గూటికి చేరతామని కొందరు ఖరాఖండీగా చెప్పారట. ఆ ముహూర్తమేమంటే సిఎల్పీ నేత ఎన్నికే. సిఎల్పీ నేత ఎన్నికైన వెంటనే ఆ పదవిని ఆశించినవారితోపాటు మరికొందరు కాంగ్రెస్ వారిని ఆకర్ష్ వలలో బంధించే ప్లాన్ లో ఉంది టిఆర్ఎస్ అని చెబుతున్నారు. .

దీంతో టిఆర్ఎస్ వ్యూహం ఫలించలేదని తెలుస్తోంది. అసలు అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ విస్తరణ ఆసల్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చి నెలరోజులుగా కేబినెట్ విస్తరణ లేక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేకపోవడం టిఆర్ఎస్ పై గుసగుసలు కూడా వినబడుతున్నాయి.

ఈ విషయంలో ఇంకో వాదన కూడా తెర మీదకు వచ్చింది. కేబినెట్ ఆలస్యం చేయడంలో మరో కారణమేమంటే? కాంగ్రెస్ వారికి మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేసి వారిని ఆకర్ష్ ద్వారా పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అంచనాల్లో ఉన్నారు. దానికోసమే మంత్రివర్గ విస్తరణ డిలే చేశారని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ 19 మందిలో కూడా పది మందికి పైగా సిఎల్పీ నేత పదవి నాకు కావాలంటే నాకు కావాలని పీకులాడుతున్నారు. సిఎల్పీ రేసులో సీరియస్ గా ఉన్నవారి జాబితా చూస్తే… ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఒకవేళ పిసిిసి పదవి తీసేస్తే), బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలంతా తనకే కావాలంటే తనకే కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే సిఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకున్నా… మిగిలిన వారు టిఆర్ఎస్ లోకి జంప్ చేయవచ్చన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. సభ ప్రారంభం కంటే ముందే కాంగ్రెస్ నుంచి కొందరిని గుంజి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలన్న టిఆర్ఎస్ అది సాధ్యం కాకపోవడంతో సిఎల్పీ నేత ఎంపిక కాగానే కాంగ్రెస్ వాళ్లను గుంజేద్దామని ప్లాన్ తో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్ కావాలనే సిఎల్పీ నేత ఎంపికను కావాలని వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. 

మరి మంత్రి వర్గ విస్తరణ ముగిసే వరకు సిఎల్పీ నేత ఎన్నికను వాయిదా వేయనుంది కాంగ్రెస్. మరి మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత అయినా సిఎల్పీ నేతను ఎన్నుకుంటే ఆ తర్వాత గోడదూకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా ఆగబడుతుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.