టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం…పార్టీ వీడుతున్న మరో నేత

గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్న బీజేపీ ఇతర పార్టీలకు గాలం వేస్తోంది. దుబ్బాకలో చూపించిన సత్తా గ్రేటర్ లో కూడా చూపించాలని భావిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీ గూటికి చేర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన తీగల కృష్ణా రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కారు దిగి కమలం గూటికి చేరుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న తీగల కృష్ణారెడ్డి… జీహెచ్ఎంసీ ద్వారా మరోసారి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.

ఈమేరకు బీజేపీ పెద్దలతో ఆయన రాయబారం నడుపుతున్నారని సమాచారం. ఈవిషయాన్ని పసిగట్టిన గూలాబీ దళం తీగలకు సర్ధిచెప్పేందుకు మంత్రి మల్లారెడ్డిని రంగంలోకి దించింది. 2014లో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి ఆతర్వాత అనతికాలంలోనే టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మహేశ్వరం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సబితా ఇంద్రారెడ్డి గెల్చారు. ఆతర్వాత ఆమె కూడా టీఆర్ఎస్ గూటికే చేరవడంతో తీగల కృష్ణా రెడ్డికి కష్టాలు ప్రారంభమయ్యాయి. సబితా ఇంద్రారెడ్డి బలమైన అభ్యర్థి కావడంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆమెకే టీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్టు ఇస్తుందని భావిస్తున్న ఆయన… తన పొలిటికల్ కెరీర్ వెతుక్కుంటూ బీజేపీలో చేరుతున్నారని తెలుస్తోంది.

అయితే ఇంత కాలం ఎమ్మెల్సీ సీటుపై ఆశ పెట్టుకున్నట్లు సమాచారం. అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఒకవేళ తీగల కృష్ణారెడ్డి పార్టీ వీడితే… జెడ్పీ చైర్మన్ పీఠంపై టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.