టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నాటి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తాజా భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ను ముంబైలోని అధికార నివాసం ‘వర్ష’లో రోహిత్ మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ, ఆ ఫోటోలు బయటకొచ్చిన వెంటనే ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఫడ్నవీస్ స్వయంగా రోహిత్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుతో ఈ చర్చ మరింత రగిలింది. రోహిత్ క్రికెట్‌కు దూరమవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో అడుగుపెడతాడా అనే ప్రశ్నలు తలెత్తడం సహజమే.
ప్రత్యేకించి మహారాష్ట్రలో రోహిత్‌కు ఉన్న ఫాలోయింగ్, ప్రజల్లో ఉన్న గుర్తింపు నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ప్రచారం అవసరం లేకుండా ఓ ప్రత్యక్ష రాజకీయ బాధ్యతను చేపట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో గంభీర్, నవజోత్ సింగ్ సిద్ధూ లాంటి క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చిన తీరును గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ వన్డే ఫార్మాట్లపై స్పష్టత ఇవ్వకుండా ఉన్నా, ఫడ్నవీస్‌ను కలవడం మాత్రం రాజకీయంగా మరో అధ్యాయానికి తెరలేపే సంకేతమా అన్నది సమయం చెప్పాల్సిన విషయం.
ఈ భేటీ అనుకోకుండా జరిగినదా లేక ముందుగానే రూపొందించిన వ్యూహం లోపల భాగమా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రోహిత్ రాజకీయ ప్రయాణం మొదలవుతుందా లేక ఇది కేవలం అభిమానుల ఊహ మాత్రమేనా అన్నది త్వరలోనే తేలనుంది.