పరిపాలకుడు విద్యావేత్త, విద్యయొక్క విలువ ఎరిగినవాడు అయితే ఆ రాష్ట్రం విద్యారంగంలో దూసుకుపోతుంది. ఆస్తులు ఇవాళ ఉండొచ్చు, రేపు కరిగిపోవొచ్చు. కానీ విద్య అనేది ఒక మనిషికి జీవితాంతము తరిగిపోని ఆస్తి. ఆర్జించేకొద్దీ పెరగడమే తప్ప క్షీణించడం అనేది తెలియని సంపద ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య అనే భోగం ఎంత గొప్పదో తెలిసినవాడు. ఈనాటి పిల్లలకు ఎలాంటి నాణ్యమైన విద్య అందిస్తే వారు జీవితాంతం సమాజానికి ఉపయోగపడగలరో గ్రహించినవాడు. అందుకే ఆయన ఆలోచనలు అన్నీ విద్యార్థులను ఉత్తమపౌరులుగా ఎలా తయారు చెయ్యాలో మొదటినుంచి స్వప్నిస్తున్నాడు. కేవలం మొక్కుబడి, పడికట్టు విద్య కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యను విద్యార్థులకు అందిస్తే వారు భవిష్యత్తులో దేశస్థాయిలో రాణించగలరని నమ్ముతున్నాడు. ఆయన ఆలోచనల ఫలితంగానే రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు సీ.బీ.ఎస్.ఇ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మరో మూడేళ్ళ తదుపరి ఈ విధానాన్ని పదవ తరగతి వరకు పొడిగిస్తారు.
ఇప్పటివరకు చాలా కార్పొరేట్ పాఠశాలలు సీ.బీ.ఎస్.ఇ విధానాన్నే అమలు చేస్తున్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల రీత్యా మెజారిటీ విద్యార్థులు సెంట్రల్ సిలబస్ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యాబోధనలో నాణ్యత, అత్యుత్తమ శిక్షణ పొందిన ఉపాధ్యాయ సిబ్బంది, క్రమశిక్షణ, పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రీడా సౌకర్యాలు, ఆకర్షణీయమైన తరగతి గదులు, రవాణా సౌకర్యం, ఆటపాటలు, ఇంకా అనేక కారణాల వలన ఖర్చు ఎక్కువైనా ప్రయివేట్ పాఠశాలలవైపే తల్లితండ్రులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశాలలు నీరసపడిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త ఊపిరులు ఊదటం తక్షణావసరం. ఆ దిశలోనే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనలకు పదును పెడుతున్నట్లు నిన్నటి ప్రభుత్వ నిర్ణయం స్పష్టం చేసున్నది.
ఇప్పటికే విద్యారంగంలో జగన్ ప్రభుత్వం అనేక సానుకూల నిర్ణయాలను తీసుకున్నది. అమ్మఒడి పధకం ద్వారా ఏటేటా తల్లులకు పదునాలుగు వేల రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నది. తల్లితండ్రులను ఆకర్శించేలా ప్రభుత్వ పాఠశాలల భవనాలు రంగులతో మెరిసిపోవాలని, నాణ్యమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలు, యూనిఫార్మ్స్ ఇవ్వడమే కాక ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులను కూడా అందజేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారంటే ఈ అంశంపై ఆయన ఎంత లోతైన కసరత్తు చేశారో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు మీడియంలో బోధించడానికి అలవాటు పడిన ఉపాధ్యాయులకు సీ.బీ.ఎస్.ఇ విధానంలో బోధించడానికి అవసరమైన శిక్షణను అందించాలి. వారి నైపుణ్యతను ఇనుమడింపజేయాలి.
ఈనాటి విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయినప్పటికీ చాలామందిలో ఆ స్థాయి కుశలత కనిపించడం లేదు. బయటప్రపంచంలో నలుగురితో ఆంగ్లంలో సంభాషించాలంటే బెదిరిపోతున్నారు. ఇంటర్వ్యూలకోసం తమ రాష్ట్రం దాటి బయటకు వెళ్తే అక్కడి అధికారులు అడిగే ప్రశ్నలు అర్ధం కాక, సరైన జవాబులు ఇవ్వలేక తలవంచుకుంటున్నారు. ఇలాంటి దుస్థితికి సరైన పునాదిలేని మన విద్యావిధానమే హేతువు. రాబోయే తరాలు ఇలాంటి అవరోధాలను అధిగమించాలంటే పునాది స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే పరిష్కారం. ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన అడుగులు వేస్తుండటం హర్షణీయం.
ఈ విధానం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త కాబట్టి ఈ సంస్కరణను సరైన దిశలో నడిపించడం కోసం అనుభవజ్ఞులైన విద్యావేత్తలతో ఒక కమిటీని నియమించాలి. ప్రభుత్వ ఆలోచనలను ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించి, తగు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించాలి. తల్లితండ్రులనుంచి, ఉపాధ్యాయవర్గాల నుంచి సలహాలను స్వీకరించాలి. మనసుంటే మార్గం ఉంటుంది. తొలుత కొన్ని అవరోధాలు ఎదురు కావచ్చు. కానీ సాహసించి అడుగు వేస్తె రాచమార్గం దొరుకుతుంది. ఎవరెస్టు శిఖరాన్ని కిందినుంచి చూసి భయపడితే టెన్సింగ్ నార్కే శిఖరపు అంచులను చూసేవాడా?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు