తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీయార్.. ఓ ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది.! అసెంబ్లీలో ఇరుపక్షాల మధ్య వాగ్యుద్ధం అందరికీ తెలిసిందే.!
ముఖ్యమంత్రి గనుక, అసెంబ్లీలో ఎటూ రేవంత్ రెడ్డికి కాస్త స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. కేటీయార్, ప్రతిపక్షంలో వున్న దరిమిలా, ఆయనకూ స్పేస్ బాగానే లభిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీయార్, ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నప్పటికీ, ఆయన అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి ఇంకా హాజరు కాలేదు.
అసెంబ్లీలో కేసీయార్, ప్రతిపక్ష నేతగా ఎలా అధికార పక్షాన్ని ఎదుర్కొంటారన్నది వేచి చూడాల్సి వుంది. కేటీయార్ తన తండ్రి కేసీయార్‌కి బదులుగా తెలంగాణ అసెంబ్లీలో హల్‌చల్ చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి ముందు వీగిపోతున్నారు.
చీమలు పెట్టిన పుట్టలో పాములు.. అంటూ, కేటీయార్ వ్యాఖ్యానిస్తే.. దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే కేసీయార్, కేటీయార్ రాజకీయాల్లో వున్నారంటూ సెటైర్ వేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే కేసీయార్ గెలిచారనీ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
వీటిని మీమ్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది. హైద్రాబాద్ అభివృద్ధి సహా అనేక అంశాలకు సంబంధించి, ‘మాటకు మాట’ చెప్పేందుకు రేవంత్ రెడ్డి, పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు.
డ్రగ్స్ వ్యవహారం, అవినీతి.. ఇవన్నీ కేసీయార్ హయాంలో పెచ్చుమీరిపోయాయని చూపించేందుకు రేవంత్ రెడ్డి, ఆ రెండు అంశాలపై పోలీస్ శాఖకు స్పెషల్ టాస్క్‌లు అప్పగిస్తున్నారు. దాంతో, సహజంగానే కేటీయార్, గులాబీ పార్టీ డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళింది.
ఓ నెల రోజులైనా, కొత్త ప్రభుత్వానికి సమయమివ్వకుండా గులాబీ పార్టీ మాటల దాడి చేయడం కేటీయార్ అండ్ టీమ్ పట్ల ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ పడటానికి కారణమైంది.