‘మేం గెలుస్తున్నాం.. గెలిస్తున్నాం కాబట్టి, గర్వం ప్రదర్శించం.. గెలిచినోడు గొప్పోడు కాదు.. ఓడినోడు ఇంకోటీ కాదు..’ అంటూ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, పోలింగ్ ముగిశాక, మీడియా ముందుకొచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మెజార్టీ ‘ఎగ్జిట్ పోల్’ అంచనాలతో స్పష్టమయ్యింది. అయితే, ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ నిజమవ్వాలని లేదు. ఎలాగైతేనేం, ఎగ్జిట్ పోల్ అంచనాలతో కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకుంటోంది. డిసెంబర్ 3న గెలుపు తమదేనని చెబుతూ, డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే సంకేతాలూ రేవంత్ రెడ్డి పంపేస్తున్నారు.
ప్రభుత్వంలో వుండేవాళ్ళు ఎలా వ్యవహరించాలి.? ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలి.? అన్న అంశాలపై రేవంత్ రెడ్డి చాలా చాలా పద్ధతిగా మాట్లాడేశారు. నిన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరు. ముఖ్యమంత్రినైపోయా.. అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట తీరు మారిపోయింది.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? క్లియర్ మెజార్టీ.. అది కూడా బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ గెలిస్తే సరే సరి. బొటాబొటి మెజార్టీతో గెలిచిందా.. అంతే సంగతులు.! రాత్రికి రాత్రి ఓ పది పదిహేను మంది ఎమ్మెల్యేలను లాగెయ్యడం కేసీయార్‌కి పెద్ద పనేమీ కాదు మరి.! ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు.
అయినా, గెలిచేశాం.. అని రేవంత్ రెడ్డి ముందుగానే ఎలా పండగ చేసుకుంటున్నట్టు.? తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మెజార్టీ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. త్రిముఖ పోటీ కూడా కాంగ్రెస్ పార్టీకి బాగానే కలిసొచ్చిందనే చర్చ అంతటా జరుగుతోంది.
65 నుంచి 70 సీట్లు వస్తాయన్నది రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ధీమా.! ఇదే డిసెంబర్ 3న వెల్లడయ్యే ఫలితాలతో స్పష్టమవుతుందా.? ఏమో, ఓటరు ఎలా తీర్పునిచ్చాడో.. అదైతే, ఈవీఎంలలో ప్రస్తుతానికి నిక్షిప్తమైపోయి వుంది.!