రామతీర్ధం జాతర ఎలా ఉంటుందో నేను చూడలేదు కానీ, గత నాలుగు రోజులుగా రామతీర్ధం రాజకీయపార్టీల జాతరతో మార్మోగిపోతోంది. జీవితంలో ఒక్కసారి రామతీర్ధం దర్శించని వారు సైతం ఇప్పుడు కాలినడకన కొండ ఎక్కి శ్రీరామచంద్రుడి శిరస్సు లేని విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. జాతీయస్థాయిలో సైతం రామతీర్ధం రామాలయం చర్చలకు నోచుకుంటున్నది. జీవితంలో ఏనాడూ దేవాలయాలకు వెళ్లి చూడని వారు, తాము అధికారంలో ఉండగా ఆలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసినవారు సైతం నుదుట తిలకాన్ని ధరించి ఆపసోపాలు పడుతూ మూడు వందల మెట్లు ఎక్కి రామాలయం ముందర నిలుచుని “జై శ్రీరామ్” అని గొంతులు చించుకుంటున్నారు! ఆలయంలో దైవం ముందు నిలబడి సంప్రదాయబద్ధంగా నమస్కరించడడం కూడా తెలియని వారు ఇప్పుడు ముకుళిత హస్తాలతో, అరమోడ్పు కన్నులతో స్వామివారికి వందనాలు సమర్పించుకుంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా రామతీర్ధాన్ని సందర్శిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రేపు జనసేన, బీజేపీ కలిసి కొండమెట్లు ఎక్కుతాయట. రాబోయే నాలుగైదు రోజులూ మన రాజకీయనాయకుల రాద్దాంతం, రచ్చలతో రామతీర్ధం రణతీర్ధంగా మారుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అదీ శ్రీరామచంద్రుడి గొప్పదనం!
ఇక అధికారపార్టీ నాయకులు ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకులు అధికారపార్టీ మీద దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మంత్రుల స్థాయిలో ఉన్నవారు సైతం హుందాతనాన్ని కోల్పోయి యథేచ్ఛగా నాలుకలకు పదును పెడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. మొన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీద దాడి చేసినవారు అయిదు వందల రూపాయల కిరాయికి తేబడినవారు అని సాక్షి పత్రిక, ఛానెల్ కథనాలను ప్రసారం చేసింది. ఒక మాజీ మంత్రివర్యుడు చంద్రబాబు కోసం సొంత ఖర్చులతో జనాన్ని తోలుకొచ్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన రామనామం ఉచ్చరించాల్సిన చోట అసభ్యపదాలు విసురుకుంటున్నారు.
ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఇలాంటి దాడులు జరిగినపుడు తక్షణమే స్పందించి నేరగాళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. కానీ, వారి స్పందన ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నది. దీనిపై ఎల్లో మీడియా చిలవలు పలవలుగా జగన్ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నది. వారిని తప్పు పట్టలేము. ఎందుకంటే అది వారి పవిత్రమైన వృత్తి బాధ్యత! మరి వారి ఏడుపులకు తగినట్లు పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారా అంటే పెదవి విరుపులే కనిపిస్తున్నాయి.
కేవలం వ్యక్తులు, నాయకుల మీద ఆరోపణలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తే సరిపోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అలా జరగలేదా అని దెప్పిపొడుపు మాటలు విసిరితే కుదరదు. చిత్తశుద్ధితో నేరగాళ్ళను వేటాడి పట్టుకోవాలి. మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఆలయంలోనూ కాపలా పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆలయ ఉద్యోగులలో ఎవరో ఒకరికి రాత్రివేళ డ్యూటీ వేసి ఆలయంలోనే నిద్రించే విధంగా ఏర్పాటు చెయ్యాలి. అలా సాధ్యం కాకపొతే ఆలయ నిధులతో భద్రతా ఉద్యోగులను నియమించాలి. ఆలయ కమిటీలకు ఆలయ రక్షణ బాధ్యతలు కూడా అప్పగించాలి. అక్కడ దుండగులు పగలగొడుతున్నవి రాతి విగ్రహాలు కాదు. ప్రజల హృదయాలు. వారి మనోవిశ్వాసాలు!
ఇక చివరిగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ పధకం గడువు ముగిసేంతవరకు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయేమో?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు