తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన టైమ్‌లో రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియోగంపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది.
ఈ కేసులోనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాం పట్టణంలోకి రాత్రి 8.35 గంటలకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని సమీపంలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయన్ను అరెస్టు చేశారంటూ తెదేపా శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ఆ తర్వాత కాసేపటికి కళా వెంకటరావుకు 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా దేవుడి కోసం టీడీపీ పోరాటం ఆగదని అన్నారు. తాము ప్రజలతోనే ఉంటామని, వారి కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్ట్ చేస్తారా, అని ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని కళా వెంకటరావు నిలదీశారు.