బాపట్ల జిల్లాలోని రామాపురం బీచ్ దగ్గర బుధవారం చోటు చేసుకున్న ఘటనతో మరోసారి సముద్రం ప్రాణాలను ఎలా బలితీస్తుందో తెలిసింది. పర్చూరు నెహ్రూ కాలనీకి చెందిన యువకులు చుక్కా వంశీ (27), రాజేష్ సరదాగా బీచ్‌కు వెళ్లారు. అయితే అలల వేగాన్ని తక్కువ అంచనా వేసి ముందుకు వెళ్లిన వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన భారీ అలల ధాటికి ఇద్దరూ సముద్రంలో కొట్టుకుపోయారు.
అప్పటికి అక్కడే కాపలాలో ఉన్న మెరైన్ పోలీసులు అప్రమత్తమై వెంటనే సముద్రంలోకి దిగి వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే వంశీ పరిస్థితి విషమంగా మారింది. నీరు మింగిన కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే చీరాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన తుది శ్వాస విడిచాడు. ఈ దుర్ఘటన వంశీ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
ఇక ఇదే ప్రదేశంలో మరో ఘటన కూడా చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పసుమర్తికి చెందిన షేక్ రహంతుల్లా అనే యువకుడు కూడా అలల ధాటికి కొట్టుకుపోయాడు. అయితే మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించడంతో అతడిని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చగలిగారు. దీనితో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలపై స్థానికులూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి వేసవి కాలంలో ఇదే రకమైన ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. అలల వేగం, లోతు, సముద్ర తీర పరిస్థితులపై పూర్తి అవగాహన లేకుండా లోపలికి వెళ్లడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, రిస్క్ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టడం, మరింత పటిష్టంగా మెరైన్ పోలీస్ వ్యవస్థను పని చేయించడం తప్పనిసరిగా మారింది. సరదా కోసం వెళ్లిన ప్రయాణం చీకటి క్షణాల్లో ముగియకూడదంటే ప్రజలే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
రామాపురంలో సముద్రంలో కొట్టుకుపోయిన యువకులు.. ఒకరు మృతి pic.twitter.com/1wkpe2QBiu
— sanju (@chsanjeevarao12) April 2, 2025