ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రోజురోజుకూ హాట్ టాపిక్ అయిపోతోంది. పాలక పార్టీ వైసీపీలో నిత్యం ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీకి మద్దతు పలకడంతో మొదలైన విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఆమంచి కృష్ణమోహన్ కరణంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరణం కూడ ఆమంచిని తొక్కిపట్టాలని చూస్తున్నారు. దీంతో చీరాల వైసీపీ రెండు వర్గాలుగ చీలిపోయింది. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో అధిష్టానం ఎవ్వరినీ కాదనలేకపోతోంది. ప్రస్తుతానికి ఈ వర్గపోరులో ఎమ్మెల్యే కరణందే పైచేయిగా ఉంది. పాలన నుండి నియోజవర్గంలో అన్ని వ్యవహారాలను ఆయనే చక్కబెడుతున్నారు. చివరికి పార్టీ పనులు కూడ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దొరకదేమోనని ఆయనలో ఆందోళన మొదలైంది.
ఇక ఊరుకుంటే లాభంలేదని కరణంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇరు వర్గాల రోడ్ల మీదే ఘర్షణలకు దిగుతున్నాయి. ఫ్లెక్సీల నుండి కాంట్రాక్టుల వరకు ఎక్కడ చూసినా గొడవే. వీరిద్దరూ ఇలా తలపడుతుంటే మధ్యలోకి వ్యక్తి ఎంటరయ్యారు. ఆమె పోతుల సునీత. దీంతో ద్విముఖ పోరు త్రిముఖ పోరుగా మారిపోయింది. టీడీపీ నుండి ఎమ్మెల్సీ అయిన ఆమె పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. రాజీనామా చేసిన ఆమెను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమెనే మళ్ళీ ఎమ్మెల్సీని చేయనున్నారు జగన్. అయితే సునీత టార్గెట్ ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే టికెట్. 2014లో టీడీపీ తరపున చీరాలలో బరిలోకి దిగిన ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన ఆమంచి చేతిలో ఒడిపోయారు.
అనంతరం ఆమంచి టీడీపీలో చేరడంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు. కానీ గత్ ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీలో చేరిపోవడంతో టికెట్ తనకే అనుకున్నారు సునీత. కానీ అనూహ్యంగా కరణంను పర్చూరు నుండి తీసుకొచ్చి చీరాలలో పోటీ చేయించారు చంద్రబాబు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్నారు సునీత. అప్పుడే వైసీపీలోకి వెళ్లిపోవాలని అనుకున్నారు. కానీ ఈలోపే కరణం వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక సునీత కూడ వైసీపీలో చేరి ఆమంచి, కరణంలతో పాటు టికెట్ కోసం పట్టుబడుతున్నారు. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా వైసీపీ నేతలు ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కరణం వర్గీయులు కూడ వచ్చారు.
వారంతా వచ్చే ఎన్నికల్లో కరణంను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో సునీత ఫెయిర్ అయ్యారట. కరణం ఎమ్మెల్యే అయితే ఇక తానూ వైసీపీలో చేరిందని ఎందుకు. టీడీపీలో అన్యాయం జరిగిందనే కదా వైసీపీలోకి వచ్చింది. ఇక్కడ కూడ అదే ట్రీట్మెంటా అంటూ ఆఫ్ ది రికార్డ్ సన్నిహితుల వద్ద వాపోయారట. అంతేకాదు వచ్చేసారి టికెట్ దక్కించుకుని తీరుతానని అంటున్నారట. చూడబోతే కొద్దిరోజుల్లో ఆమె కూడ ఆమంచి, కరణం యుద్ధంలో మూడవ పోటీదారుగా చేరిపోవడం ఖాయం అనిపిస్తోంది. చూస్తుండగానే వైసీపీలో రాజుకున్న ఈ నిప్పును జగన్ వీలైనంత త్వరగా ఆర్పకపోతే పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది.