కమ్మ కులస్తులకు సారీ… కండిషన్స్ అప్లై!

ఏపీలో కుల రాజకీయం అధికం అనేది తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయాల్లో సామాజికవర్గం కూడా కీలక భూమిక పోషిస్తుంది. అప్పటినాయకులు ఆ స్థాయిలో జనాల్లో ఈ భవన ఇంజెక్ట్ చేశారు. వారి స్వార్థ రాజకీయాలకోసం అంతగా ఎక్కించేశారు!

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఆ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాస్త గట్టిగానే మాట్లాడారనే కామెంట్లు వినిపించాయి. దీనిపై కమ్మ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు. అయితే తాజాగా ఆయన క్షాపణలు చెప్పారు.

కమ్మ సామాజికవర్గంపై ఆమంచి చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల ఆ సామజికవర్గంలో మంట లేచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కమ్మ సామాజికవర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆమంచి కృష్ణమోహన్ క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో స్పందించిన ఆమంచి… వేటపాలెం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజికవర్గంలో కుల రహితంగా బతికేవారిని, తన శ్రేయోభిలాషును, స్నేహితులను బాధించాయని, ఈ నేపథ్యంలో అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.

ఇదే సమయంలో కమ్మ సామాజికవర్గంపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మరోపక్క… ఘటనకు కారణమైన వ్యక్తులకు మాత్రం తన క్షమాపణలు వర్తించవని ఆమంచి స్పష్టం చేశారు.

కాగా… చీరాల వైసీపీలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవల వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయితీ 6, 10 వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ఆమంచి వర్గీయులు నామినేషన్లు వేయడానికి ప్రయత్నించగా కరణం వర్గీయులు అడ్డుకున్నారు!

దీంతో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం తనయుడు వెంకటేష్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల జనం కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వివాదం పెద్దదయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ఇరువైపులా శాంతింపచేయడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే ఆమంచి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి. దీనంతటికీ బలరాం, ఆయన కుమారుడే కారణమని… కమ్మ నా కొడుకులంటూ దుర్భాషలాడారు. తాజాగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి క్షమాపణలు చెబుతూ… కండిషన్స్ అప్లై అన్నారు!