ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ అనేక సార్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అందుకే సభకు హాజరయ్యే అవసరం లేదని అంటున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో తనకు సరిపడా సమయం కేటాయించకపోవడమే తన గైర్హాజరుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యవహారంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.
రఘురామ మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందేందుకు కనీసం 18 మంది ఎమ్మెల్యేలు అవసరమని స్పష్టంచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఆ సంఖ్య లేదు కబట్టి ఆ హోదా వారికి లభించదని తెలిపారు. అంతేకాదు, జగన్ అసెంబ్లీకి గైర్హాజరయ్యే విధానం రాజ్యాంగ ఉల్లంఘనగా మారుతుందా? అనే చర్చ కూడా మొదలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, వరుసగా 60 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోతే, సంబంధిత ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశముందన్నారు.
ఇప్పటి వరకు జగన్ అసెంబ్లీ నుంచి సెలవు కోసం అధికారిక లేఖ ఇవ్వలేదని, అలాంటి లేఖ లేనిచో, సభ్యత్వం రద్దు చేసే హక్కు సభాపతికి ఉంటుందని రఘురామ గుర్తు చేశారు. గైర్హాజరును కొనసాగించాలని జగన్ కోరుకుంటే, తప్పనిసరిగా మరో లేఖ సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఇంతటి సీరియస్ విషయంపై జగన్ నిర్లక్ష్యంగా స్పందించారని, విలేఖరి ప్రశ్నించినప్పుడు “ఏం చేసుకుంటారో చేసుకోనీయబ్బా” అంటూ సమాధానమిచ్చారని డిప్యూటీ స్పీకర్ విమర్శించారు.
ఈ పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందా? లేకపోతే, 60 రోజులు పూర్తయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి ఏమైనా ప్రమాదమా? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.