Raghurama : సొంత నియోజకవర్గానికి రఘురామ.. కోడి పందాల కోసమేనా.?

Raghurama : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చాలాకాలం తర్వాత సొంత నియోజకవర్గానికి వస్తున్నట్లు ప్రకటించడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాల కోసమే రఘురామ నర్సాపురం వస్తున్నారు తప్ప, ఆయనకు నియోజకవర్గ అభివృద్ధి పట్ల, తనను గెలిపించిన ప్రజల పట్ల కనీస బాధ్యత లేదన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.

సంక్రాంతి కోడి పందాలనగానే.. ముందుగా రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తుంటుంది. కోర్టు తీర్పులెలా వున్నా, కోడి పందాలు జరుగుతాయంటూ చాలాకాలంగా కోడి పందాలపై రఘురామ వ్యాఖ్యానిస్తుంటారు. ఆ కోడి పందాల వ్యవహారాన్ని పక్కన పెడితే, నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి గత కొంతకాలంగా రఘురామ భయపడుతున్నారు.

తనను గెలిపించిన వైసీపీని కాదని, ఇతర పార్టీలపై ప్రేమ పెంచుకున్నారు రఘురామ. అలా సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి, ‘రెబల్ ఎంపీ’గా అవతారమెత్తిన రఘురామ, వైఎస్ జగన్ ప్రభుత్వమ్మీదా, వైసీపీ మీదా అవాకులు చెవాకులూ పేలుతూ ఢిల్లీలోనే కాలం గడిపేస్తూ వచ్చారు.

కొన్నాళ్ళ క్రితం ఆయన విపరీతమైన పోకడల కారణంగా కేసులు నమోదవడం, ఆయన్ను ఏపీ సీఐడీ అరెస్టు చేయడం తెలిసిన విషయాలే. అప్పటినుంచి ఆయన మరింతగా అరెస్టు భయంతో వణికిపోతున్నారు. అది నిజం భయమా.? కాదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.

‘నేను నర్సాపురం వస్తున్నా.. నాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి..’ అంటూ రఘురామ ప్రకటనలు చేస్తుండడం హాస్యాస్పదం కాక మరేమటి.?