కరోనా పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్నారు. కొవిడ్ రోగుల పేరు చెబితేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. రోగి ఉన్న ప్రాంతం, పరిసరాల్లోకి రావడానికి జంకుతున్నారు. వ్యాధి సోకితే మరణం అంచున ఉన్నట్లుగానే భావిస్తున్నారు. వ్యాధి గ్రస్తులతో మాట్లాడినా కొవిడ్ వచ్చేస్తుంది అన్న ఆందోళన ఏర్పడింది. ఇతరులకే కాదు..వ్యాధి గ్రస్తుని కూడా కుటుంబ సభ్యులు నేరుగా చూడటం లేదు. రోగి పట్ల ఏహ్య భావం ప్రదర్శిస్తున్నారు. ఇక రోగి మృతి చెందితే సన్నిహితులు, బంధువులే కాదు..కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటున్నారు. కనీసం చివరి చూపుకు కూడా కొన్ని ఫ్యామిలీలు వెళ్లడం లేదు. దూరం నుండే నివాళులు అర్పిస్తు న్నారు. రోగి వల్ల కలిగే వాస్తవ నష్టం కంటే కూడా ఈ సామాజిక నష్టం, భయం ఈ రోగం పట్ల ప్రజల్లో ఆందోళన మరింతగా పెంచుతోంది.
వైరస్ సోకితే సామాజిక వెలివేతకు గురవుతామన్న భయం నానాటికి పెరిగిపోతుంది. అంటువ్యాధైనా భయపడాల్సిన పనిలేదని..రోగుల పట్ల వివక్ష తగదని ఎంత మొత్తుకున్నా భయాందోళనలు తగ్గడం లేదు. కొవిడ్ పట్ల ప్రభుత్వం, వైద్య సంఘాలు, సామాజిక సేవా సంఘాలు ఎన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నా ప్రజల్లో భయం మాత్రం పోవడం లేదు. ఆరుగంటల తర్వాత వైరస్ చనిపోతుందని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు, అధ్యయనాలు చెబుతున్నా ఆవెక్కడా? ఎవరు తలకెక్కించుకోవడం లేదు. భారత్ సహా చాలా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఇప్పుడా భయాన్ని తరమేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం సంచలనంగా మారింది.
సేవే మార్గం-మార్పే లక్ష్యం అనే నినాదంతో చిత్తూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్, భూమాన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. నేరుగా చిత్తూరులోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగిని కలిసి..రోగి భుజంపై చేయి వేసి మరీ చెవిరెడ్డి పరామర్శించారు. ఇక భూమాన అయితే మృతి చెందిన కోవిడ్ రోగి దగ్గరకు వెళ్లారు. స్వయంగా అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఘటన రాష్ర్టంలోనే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. వాళ్ల ప్రదర్శించిన తీరు చూస్తే నాడు మహత్మాగాంధీ, మథర్ థెరిస్సా సేవల్ని స్మరించేలా చేసారు. కొవిడ్ కు సంబంధించి ఇరువురు సామాజికి సంస్కర్తల్లా మారిపోయి నిజమైన ప్రజా ప్రతినిధులు అనిపించారు.
ప్రజల్లో దీర్ఘ కాలికంగా ఉన్న భయాందోళనలు, అపోహలు ప్రాలద్రోల్లడానికి నడుంకట్టారు అనడానికి ఈ సంఘటన చాలదా. సామాజిక దురాచారాలపై ఇరువురు సమరశంఖం పూరించారు.నాడు కుష్టు రోగుల్ని దగ్గరకు తీసుకున్న మహత్మాగాంధీ , తాడిత పీడిత జనాల్ని ఉద్దరించిన మధర్ తెరిస్సా తరహాలో కొవిడ్ రోగులపై అపోహల్ని తొలగించే వైతాళికులుగా ఇరువురు అవతరించడం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా నెటి జనులు అధికార పార్టీ ఎమ్మెల్యేల్ని ఇద్దర్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రోగుల పట్ల రియల్ హీరోలగా ఖ్యాతికెక్కారు.