మూడు రాజధానుల అంశం ఏపీలో రోజురోజుకూ వేడిని పెంచుతోంది. వడివడిగా శాసనసభలో బిల్ పాస్ చేసుకుని, గవర్నర్ ఆమోదం తీసుకుని శాఖలను విశాఖకు తరలించడానికి ప్రభుత్వం సన్నద్దమైన నేపథ్యంలో హైకోర్టు స్టేటస్ కో విధించి అడ్డుకట్ట వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో తరలింపు మాత్రమే కాదు కనీసం విశాఖలో శంఖుస్థాపన చేయడానికి కూడ వీలు లేకుండా పోయింది ప్రభుత్వానికి. దీంతో ప్రభుత్వం స్టేటస్ కో మీద స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈ పిటిషన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ధర్మాసనం ముందుకు వచ్చింది. కానీ బాబ్డే తానీ కేసును విచారించలేనని అంటూ తప్పుకుని పిటిషన్ ను జస్టిస్ రొహింటన్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు పంపారు.
జస్టిస్ బాబ్డే కేసును విచారించలేను అనడానికి కారణం ఇదే కేసు విషయంలో ఆయన కుమార్తె రుక్మిణీ బాబ్డే హైకోర్టులో రైతుల తరపున వాదించడం. అందుకే జస్టిస్ బాబ్డే నైతిక విలువలకు చోటిస్తూ విచారణ చేయలేనని తప్పుకున్నారు. ఇక బుధవారం పిటిషన్ జస్టిస్ రొహింటన్ నారీమన్ నారీమన్ ధర్మాసనం ముందుకురాగా ఆయన కూడా విచారణ జరపలేనని తప్పుకున్నారు. అందుకు కారణం నారీమన్ తండ్రి ఫాలీ నారీమన్ కు ఈ కేసు వివరాలు తెలియడమే. అందుకే ఆయన కూడా విచారణ జరపలేను అన్నారు. ఈ అంశాన్ని ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎవరికివారు తమకి ఇష్టమోచ్చిన, అనుకూలమైన రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారాలతో కేసు మీద, కోర్టుల మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో.
టీడీపీ అయితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, మరొక న్యాయమూర్తి ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించమని తప్పుకున్నారు అంటే ఆ పిటిషన్ పూర్తిగా చట్టబద్దం, న్యాయబద్దం కాదని, అంటే ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా వెళుతోందని, ఇక్కడే మనం గెలిచేశామని అంటోంది. దీంతో కొందరు ప్రజల్లో, అమరావతి రైతుల్లో నిజమే తీర్పు చెప్పే జడ్జీలే కేసు మాకొద్దు అన్నారంటే అదెంత అన్యాయమైన కేసు అయ్యుంటుందో కదా అనుకుంటున్నారు. నిజానికి ఇలా జడ్జీలు విచారణ నుండి తప్పుకోవడం కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు ఇలా జరిగింది. కొన్నేళ్ల క్రితం న్యాయమూర్తులు అందరూ కలిసి తీర్పులో పారదర్శకత, ఆ తీర్పు మీద ప్రజల్లో నమ్మకం ఉండేలా ఉండటం కోసం తమను ప్రభావితం చేసే విషయాలు ఏవైనా కేసులో ఉంటే స్వచ్చంధంగా ఆ కేసు నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది నైతిక విలువలకు పెద్దపీట వేయడం తప్ప మరొకటి కాదు.
కాబట్టి కేసుకు ఏదో ఒక విధంగా రిలేట్ అయి ఉన్న న్యాయమూర్తులు కేసును విచారించలేము అన్నంత మాత్రాన ఆ కేసులో నిజాయితీ లేదని, ఆ పిటిషన్ వేసిన వారు చివరికి ఓడిపోతారని కాదు. ఇక వైసీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా అయితే ఇలా జడ్జీలు తప్పుకోవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని వాదిస్తున్నారు. పిటిషన్ను తమకు అనుకూలమైన బెంచ్ వద్దకు తీసుకురావడానికి బాబు ఆడుతున్న గేమ్ అని అంటున్నారు. అసలు బాబ్డే కుమార్తె హైకోర్టులో ఈ కేసును విచారించనేలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ విచారణలో మాత్రమే పాల్గొన్నారని, అలాగే నారీమన్ తండ్రికి కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే వివరించామని చెప్పారే తప్ప, ఆయన తమ తరఫున ఈ కేసులో వాదనలు వినిపిస్తారని చెప్పలేదు కాబట్టి ఇది కూడా బాబు కుట్రలో భాగమే అంటున్నారు.
Read More : విశ్లేషణ: అమరావతికి, విశాఖకి ఇదే తేడా !
అసలు కేసును విచారించలేను అని తప్పుకున్న ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు నిజంగా తన కుమార్తె హైకోర్టులో రైతుల తరపున వాదించారా లేదా అనేది తెలియకుండా ఉంటుందా.. మరీ అంత సులువుగా ఆయన తప్పుకుంటారా అనేది ఇక్కడ గ్రహించాల్సిన విషయం. అలాగే జస్టిస్ నారీమన్ కు కూడా తన తండ్రి కేసును వాదించరని తెలుసు. కేవలం కేసు వివారలు మాత్రమే ఆయనకు వివరింపబడ్డాయని తెలుసు. అయినా విచారణ చేయలేనని తప్పుకోవడానికి కారణం నైతిక విలువలు. వాటి కోసమే ఇద్దరు న్యాయమూర్తులూ విచారణ చేయలేమన్నారు. అంతేకానీ చంద్రబాబు కుట్ర చేయడం వలన కాదు… ఒకవేళ చేసినా ఆ కుట్రలో ఇరుక్కునేంత అమాయకులై కాదు. ఇకనైనా రాజకీయ పార్టీలు న్యాయస్థానాల తీర్పులను, నిర్ణయాలను తమకు అనుకూలంగా వక్రీకరించి వాడుకోవడం మానుకుంటే మంచిది.