ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం సాగుతున్న వేళ, పల్నాడు జిల్లాలో పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికార కూటమి అక్రమాలను ప్రశ్నించకుండా ఉండేందుకు కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని గృహనిర్బంధాలు, అర్ధరాత్రి అరెస్టులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు గృహనిర్బంధం చేయగా, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని అర్ధరాత్రి పిడుగురాళ్ల వైసీపీ కార్యాలయంలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి, నరసరావుపేటలోని ఆయన నివాసానికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు.
నామినేషన్ల వేళ ముందస్తు జాగ్రత్తలు, శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు కేవలం విపక్ష నేతలనే ఇళ్లకే పరిమితం చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో నామినేషన్లు వేయకుండా ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికార కూటమి నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోని యంత్రాంగం, కేవలం వైసీపీ నేతలపైనే ఈ రకమైన ప్రతాపం చూపించడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నామినేషన్ల కేంద్రాల వద్ద దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే, అధికార కూటమి నేతలందరినీ పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం పరమ ‘గాంధేయవాదులు’గా భావిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు ఎవరు చేసినా చర్యలు సమానంగా ఉండాలి కానీ, కేవలం ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధం చేసి, అధికార పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పల్నాడులో వన్ సైడ్ గా సాగుతున్న ఈ పోలీసుల ముందస్తు చర్యలు స్థానిక ఎన్నికల నిష్పాక్షికతను పూర్తిగా శంఖింపజేసేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.