నెల్లూరులో టీడీపీకి షాక్ ఇచ్చిన జనసేన..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కూటమిలో (టీడీపీ-జనసేన) సీట్ల సర్దుబాటు పంచాయితీలు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. తాజాగా నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడవలేదు. ఇరు పార్టీల స్థానిక నాయకత్వాల మధ్య జరిగిన పలు దఫాల చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. జనసేన స్థానిక నేతలు డిమాండ్ చేసినన్ని డివిజన్ సీట్లను కేటాయించడం అస్సలు కుదరదని నెల్లూరు టీడీపీ నాయకత్వం ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో ఇరు పార్టీల మధ్య పొత్తుల బంధానికి గండిపడింది.

కార్పొరేషన్ పరిధిలోని మొత్తం స్థానాల్లో కనీసం 30 శాతం సీట్లను తమకు కేటాయించాలని జనసేన పట్టుబట్టింది. అయితే, క్షేత్రస్థాయిలో తమకు బలం ఉన్న డివిజన్లను జనసేనకు వదులుకోవడానికి టీడీపీ నేతలు నిరాకరించారు. దీంతో టీడీపీ ఒంటెద్దు పోకడలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన శ్రేణులు, నెల్లూరు కార్పొరేషన్‌లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. కూటమి ధర్మాన్ని పక్కనబెట్టి, తాము కోరిన 30 శాతం డివిజన్లలో స్వతంత్రంగా అభ్యర్థులను నిలబెట్టాలని జనసేన నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ పొత్తుల వివాదం ముదిరిన నేపథ్యంలో జనసేన అధిష్ఠానం తమ అభ్యర్థులకు లైన్ క్లియర్ చేసింది. రేపు ఉదయం నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలబడే జనసేన అభ్యర్థులకు పార్టీ సీనియర్ నేత తమ్మిరెడ్డి శివశంకర్ అధికారికంగా బీ-ఫారాలను పంపిణీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన ఈ రెండు పార్టీలు, ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ పోరులో ముఖాముఖి తలపడనుండటం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందోననే చర్చ సర్వత్రా మొదలైంది.