రాచమల్లు వింత కామెంట్స్.. ఎందుకిలా..?

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులు ఓటుకు డబ్బుల పంపిణీపై బహిరంగంగా మాట్లాడటానికి వెనకాడుతుంటారు. కానీ రాచమల్లు మాత్రం ప్రెస్ మీట్‌లో ఏకంగా ఓట్ల కొనుగోలు వ్యవహారాన్ని బాహాటంగానే ఒప్పుకుంటూ, తెలుగుదేశం పార్టీ కూటమి ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల ఎన్నికల్లో ఓటర్లకు రావాల్సిన డబ్బులు అందకుండా పోయాయంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ఏకగ్రీవాల వల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. “ఒకవేళ ఈ స్థానిక ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే.. ఓటుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ₹2,000, అలాగే మా వైఎస్సార్‌సీపీ తరఫున మేము ఒక ₹2,000 ఇచ్చేవాళ్లం” అని బహిరంగంగా పేర్కొన్నారు. ఆ లెక్కన ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే ఈ దసరా, దీపావళి పండుగ పూట కనీసం ₹16,000 వరకు డబ్బులు వస్తాయని ప్రజలు ఆశపడ్డారని, కానీ కూటమి నేతలు ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల సామాన్య ఓటర్లకు చెందాల్సిన ఆ డబ్బులన్నీ ఆగిపోయాయని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఆయన కూటమి ప్రభుత్వానికి ఒక వింత డిమాండ్ చేశారు. “ఎలాగూ ఏకగ్రీవాల వల్ల ఎన్నికల ఖర్చు మిగిలింది కాబట్టి.. ప్రజలు నష్టపోయిన ఆ డబ్బులను ప్రభుత్వమే అందించాలి. మా తరఫున ఇవ్వాల్సిన ₹2,000, మీ తరఫున ఇవ్వాల్సిన ₹2,000 కలిపి మొత్తం ₹4,000 చొప్పున ఓటర్లకు మీరే పంచండి” అంటూ రాచమల్లు వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.