2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరతామని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ చెబుతోంది. 2019 ఎన్నికలకు ముందు అయితే, చంద్రబాబు ప్రభుత్వం.. ఏకంగా 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కీలక దశలు పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేస్తామని ప్రగల్భాలు పలికింది. టీడీపీ సర్కార్ ప్రకటన తుస్సుమంది. ఆ మాటకొస్తే, అది ఎన్డీయే ప్రభుత్వం ప్రకటన.. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదంటే, ఆ పాపంలో బాధ్యత టీడీపీతోపాటు, బీజేపీ తీసుకోవాల్సిందే. ఇక, వైఎస్ జగన్ హయాం విషయానికొస్తే.. రివర్స్ టెండరింగ్ పేరుతో చాలాకాలం పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఇప్పుడైతే ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగానే నడుస్తున్నాయి.
కానీ, ప్రాజెక్టు పూర్తి చేయడమంటే.. నిర్మాణం ఒక్కటీ పూర్తి చేస్తే సరిపోదు.. పునరావాసం అత్యంత కీలకమైనది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్నదానిపై కొత్త అనుమానాలకు కారణమయ్యాయి. ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్, పునరావాస కాలనీల నిర్మాణం అస్సలేమాత్రం సంతప్తికరంగా లేదనీ, కేవలం 20 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయనీ శ్రీకాంత్ అయ్యర్ చెప్పారు. కానీ, అధికారిక లెక్కల ప్రకారం, 70 శాతం పైనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు పూర్తి చేయడమంటే.. అన్ని విషయాలూ కలిపే కదా.! పైగా, ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంబంధించి అవసరమయ్యే నిధుల్లో ఆర్ అండ్ ఆర్, పునరావాసానికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వుంటుంది.
కేంద్రం నిధులు ఎంత వేగంగా ఇస్తే, ఆయా పనులు అంత వేగంగా పూర్తవుతాయి. చంద్రబాబు పునాదులేసి, ప్రాజెక్టుని పైకి లేపారు.. వైఎస్ జగన్.. పైకి లేచిన ప్రాజెక్టుకి రూపు తెస్తున్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్.. అంటే టీడీపీ హయాం, చంద్రబాబు హయాం అన్నమాట. ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్, పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి కాకపోతే, కాఫర్ డ్యామ్ పూర్తి చేయడమనేది కష్ట సాధ్యం. ప్రాజెక్టులో నీటి నిల్వ అంతకన్నా అసాధ్యం. మరి, ఆ అసలు పనులు 20 శాతం కూడా పూర్తి కాకుండానే, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా.. అనడం ఎంతవరకు సబబు.? ఎక్కడో మభ్యపెట్టే ప్రక్రియ అయితే జరుగుతోంది. ఈ వ్యవహారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా వుండి, వాస్తవాల్ని వెల్లడిస్తే మంచిదేమో.!