పోలవరాన్ని ఎన్నికల ప్రాజక్టుగా వాడుకుంటున్న చంద్రబాబు

 

(వి. శంకరయ్య )

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ ప్రాజెక్టులు సాగర్ గాని శ్రీ శైలం గాని కాంగ్రెస్ హయాంలోనే నిర్మాణం జరిగింది. సాగర్ 1955 లో నిర్మాణం ప్రారంభించి1967 లో పూర్తి చేశారు. శ్రీ శైలం1964 లో ప్రారంభింపబడి 1984 డిసెంబర్ నాటికి క్రస్ట్ గేట్లతో సహా పూర్తి అయింది. ఈ మధ్య కాలంలో పలు మార్లు సాధారణ ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ చరిత్ర పుటలు తిరగేసితే ఏ సందర్భంలో ఏ కాంగ్రెస్ నేత అయినా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశంలో పడుతున్న తాపత్రయం రాజకీయ వత్తిడి మచ్చుకు కనిపించదు. ప్రాజెక్టులను దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం సాగించారు. అందుకే సాగర్ తిలకించిన పండిత్ నెహ్రూ ఎంతో ముచ్చట పడి ఆధునిక దేవాలయంగా పేర్కొన్నారు. 

కాని ప్రస్తుతం వచ్చిన చిక్కలా 2019 లోతను తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఒక ఉపకరణంగా పోలవరం ప్రాజెక్టును భావించడంతోనే విమర్శలు వస్తున్నాయి. కనీసం 2014 లో అధికారంలోకి రాగానే పోలవరం పై దృష్టి పెట్టలేదు. పట్టి సీమ అంటూ ప్రతి పక్ష నేత జగన్ తో సవాల్ చేసి కాంట్రాక్టర్లకు దోచి పెట్టి కాగ్ వద్ద విమర్శలకు గురైనారు. 2016 సెప్టెంబర్ లో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే వరకు కాల క్షేపం చేశారు. తదుపరి ప్రతి సోమవారం పోలవరం గా వ్యవహరించడం అభినందించ దక్క దైనా పుణ్య కాలం గడిపేసి ఇప్పుడు ఇతరులపై విమర్శలు చేసి ఏం లాభం?నాణ్యతతో దీర్ఘకాలం మన వలసిన ప్రాజెక్టు కొద్ది నెలల్లో పూర్తి చేయాలను కోవడంతోనే కేంద్రం వద్ద కొర్రీలు ప్రతి పక్షాల వద్ద విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటికి తాళ లేక ఎదురు దాడికి దిగు తున్నారు. 

పోలవరమే  కాదు ఏ ప్రాజెక్టుఅయినా హెడ్‌ వర్క్స్ తో పాటు ముందుగా ప్రాజెక్టు మునక బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. పునరావాసం కల్పించాలి. అదే సమయంలో కనీసం నిల్వ చేసే నీటిని ఉపయోగించేందుకు వీలుగా పంట కాలువల నిర్మాణం జరగాలి. ప్రస్తుతం పోలవరంలో ఈ రెండు అంశాలకు తిలోదకాలు వదిలారు. అసలు డామ్ పక్కన బెట్టి కాపర్ డామ్ తో నీరు పారించి 2019 లో గెలుపు గుర్రం ఎక్కాలని చేస్తున్న ఆలోచనకు అనువుగా కూడా పనులు జరగడంలేదని,  డిసెంబర్ 19 వతేదీ ప్రాజెక్టు అథారిటీ-  రాష్ట్ర అధికారులను నిలదీసింది. దురదృష్టమేమంటే ఈ వార్తను వైసిపి పత్రిక ప్రముఖంగా ప్రకటించడంతో టిడిపి నేతలు రాజ కీయ విమర్శగా కొట్టి పారేశారు. కాని టిడిపిని కంటికి రెప్పలా కాపాడే ఒక పత్రిక అప్రాముఖ్యంగానైనా ఈ వార్త ను ప్రకటించకతప్పలేదు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సంధించిన ప్రశ్నలు ప్రతి పక్షాల సృష్టించిన అడ్డంకులంటే ఎలా? 

41.15 మీటర్ల ఎత్తుకు కాపర్ డామ్ నిర్మాణం చేస్తే 18 వేల కుటుంబాలను తరలించాలసి వుందని ప్రస్తుతం 4వేల కుటుంబాలు తరలింపు జరిగిందని మిగిలిన వారి పరిస్థితి ఏమిటని అథారిటీ నిలదీసింది.

టెండర్లు పిలిచామని పనులు జరుగుతున్నాయని అధికారులు సమాధానం చెప్పారు. ప్రాజెక్టు పనులకు తగిన విధంగా పునరావాస ప్రణాళిక లేదని అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవంలో కూడా పునరావాసం పనులు పూర్తి కావు. ప్రాజెక్టులో పగలు రాత్రి కాంక్రీట్ పోసి పనులు పూర్తి అయినట్లు చెప్ప వచ్చు. కాని దాదాపు 12 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించడం పాతాళ భైరవి సినిమాలోని భేతాళ మాంత్రికుని అవతార మెత్తితే తప్ప వీలుకాదు. ప్రతి వారం హెడ్ వర్క్స్ పనులు సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి ఏనాడూ పువరావాసం గురించి మాట్లాడిన సందర్భం మీడియా లో కనిపించ లేదు. 

ఇదే సమావేశంలోనే కుడి ఎడమకాలువ పనులు ఆగిపోయాయని కూడా అథారిటీ గుర్తు చేసింది. ఈ సమావేశంలోనే కాకుండా ఇది వరకు జరిగిన పలు సమావేశాల్లో కాపర్ డామ్ తో నిల్వ చేసే నీరు ఉపయోగించేందుకు పంట కాలువలు బ్రాంచి కాలువలు గురించి నిలదీసిన సందర్భాలు వున్నాయి. ప్రస్తుతం కూడా ఈ పనులు కించిత్ ముందుకు సాగలేదు. కాకుంటే కృష్ణ డెల్టా కు సరఫరా చేస్తారేమో. అప్పటికి పునరావాసం మెడ మీద కత్తిలా వుంటుంది. . ఏప్రిల్ మే నాటికి కాపర్ డామ్ పూర్తి అయినా వరదను మళ్ళించేందుకు పైలెట్ ఛానల్ స్పిల్ వే నిర్మాణం గురించి కూడా అథారిటీ మొన్నటి సమావేశంలో వివరాలు అడిగింది.

దుర్మార్గమేమంటే ప్రాజెక్టు అథారిటీ సాంకేతికంగా లేవనెత్తు అంశాలనే ఎవరైనా ప్రశ్నిస్తే వారినంతా ప్రాజెక్టు నిర్మాణం కు అడ్డు పడే వారుగా టిడిపి నేతలు చిత్రించు తున్నారు. అందుకే ప్రాజెక్టుల నిర్మాణం నేతల గెలుపు గుర్రాలు కాకూడదు?

(వి. శంకరయ్య , రాజకీయ వ్యాఖ్యాత ఫోన్ నెం  9848394013)