ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తన మూర్ఖపు చర్యలతో మళ్లీ భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాల్లో పడుతోంది. కానీ భారత గగనతల భద్రతకు కంచుకోటలా నిలిచే ఆదంపుర్ ఎయిర్‌బేస్ ఇప్పటివరకూ ఎన్ని దాడులైనా తిప్పికొట్టి, మరింత బలంగా ఎదిగింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ స్థావరాన్ని సందర్శించి, అక్కడి ఎస్-400 వ్యవస్థను పరిశీలించడంతో దీని ప్రాధాన్యం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పంజాబ్‌లో పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదంపుర్ వైమానిక స్థావరం 1950ల నుంచే దేశ రక్షణకు మైలురాయిగా నిలుస్తోంది. పాకిస్థాన్ ఎప్పటికప్పుడు దీన్ని లక్ష్యంగా చేసుకున్నా, ఇది మాత్రం ఎలాంటి దాడిని అయినా సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. ఇటీవలే పాక్ ప్రయోగించిన ఆరు క్షిపణులను ఇది లక్ష్యానికి చేరకముందే ఛేదించింది.
చరిత్రలోకి వెళ్తే, 1965 యుద్ధం, 1971 యుద్ధం, 1999 కార్గిల్ సమయంలో ఈ స్థావరం పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. ఒక్క 1965 యుద్ధంలోనే స్థానిక గ్రామస్తులు పాక్ కమాండోల్ని పట్టుకుని భారత దళాలకు అప్పగించిన ఉదంతం ఇప్పటికీ గర్వకారణం. కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ పై దాడులకు ఆదంపుర్ నుంచే మిరాజ్-2000 యుద్ధవిమానాలు ఎగిరాయి.
ఇప్పటికి 47వ స్క్వాడ్రన్ (బ్లాక్ ఆర్చర్స్), 28వ స్క్వాడ్రన్ (ఫస్ట్ సూపర్ సోనిక్స్) వంటి కీలక బలగాలకు ఆదంపుర్ స్థావరం నిలయం. పఠాన్‌కోట్, హల్వార, బఠిండా, అమృత్‌సర్ వంటి ఇతర వైమానిక స్థావరాలతో కలిపి ఇది ఒక వ్యూహాత్మక రక్షణ గ్రిడ్‌గా పనిచేస్తోంది. దీనికి తోడు, అత్యాధునిక ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ఇక్కడే మొట్టమొదటిగా మోహరించడంతో భారత గగనానికి భేదించలేని కవచంగా మారింది. పాక్ గాలి మార్గంలో ఏ చిన్న కదలిక అయినా, ఆదంపుర్‌కి అందనిది ఏమీ లేదు!