కర్ర విరగకూడదు.! పాము చావకూడదు.! ఇది చాలామందికి తెలిసిన మాటే.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
నానా రకాల బేరాల అనంతరం 8 సీట్లలో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి అనుమతి పొందారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కింది స్థాయిలో జనసైనికులు కష్టపడుతున్నారు. నాయకులూ తమవంతు కష్టపడుతున్నారు. తీరిగ్గా జనసేనాని ఎన్నికల ప్రచారంలోకి దిగారు.
వరంగల్ జిల్లాలో జనసేనాని పర్యటించారు, బహిరంగ సభలో పాల్గొని బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలంటూ జనసేన శ్రేణులకీ, తన అభిమానులకీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు జనసేన – బీజేపీ పార్టీలకు అండగా వుండాలని విజ్ఞప్తి చేశారు.
అక్కడితో ఆగలేదు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామనీ, బీసీ ముఖ్యమంత్రిని అయినా చూసే అవకాశం బీజేపీ ద్వారా లభిస్తుందని జనసేనాని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని హామీ ఇచ్చిన కేసీయార్, ఆ తర్వాత మాట మార్చిన వైనాన్ని ఇంత సున్నితంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తావించారన్నమాట.
ఎక్కడా తెలంగాణలోని అధికార పార్టీ మీద పవన్ కళ్యాణ్ విమర్శలు చేయలేదు. ఆ రిస్క్ ఆయన చేయలేకపోయారు. ఏమో, ముందు ముందు జరగబోయే బహిరంగ సభల్లో అయినా జనసేనాని, ఫక్తు రాజకీయ ప్రసంగాలు, గులాబీ పార్టీని టార్గెట్‌గా చేసుకుని వుంటాయేమో.!
ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేసిన ప్రసంగాలు జనసైనికుల్ని నీరసానికే గురిచేశాయి.